చక్రబంధంలో పవన్..?

తెలుగుదేశంతో పొత్తు విషయంలో పవన్‌ కళ్యాణ్‌ చక్రబంధంలో ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే వాట్‌ నెక్స్ట్ అనే విషయంలో జనసేనకు క్లారిటీ లేదు. పదవుల పంపకాలపై ఎలాంటి హామీలు తెలుగుదేశం నుంచి లేవు. అయినా ఆ పార్టీతో పొత్తును పవన్‌ ఖాయం చేసేశారు. ‘మీరు గెలిపిస్తే తాను సీఎం అవుతానని, తనకు కూడా సీఎం కావాలని ఉందని, సీఎం కావడం అంత సులభం కాదని... ఇలా చాలా సందర్భాల్లో అభిమానులతో ఆయన అన్నారు. కానీ ఆయన లక్ష్యం వైకాపాను ఓడించడమే. జగన్‌ పార్టీ ఓటమి వల్ల పవన్‌ ఈగో సంతృప్తి చెందుతుంది.

Update: 2023-12-23 03:14 GMT

 pawan kalyan

ఈ బలహీనతనే ఇప్పుడు తెలుగుదేశం క్యాష్‌ చేసుకుంటోంది. పవన్‌ కాస్త బెట్టు చేయగానే ఆయన దగ్గరకు వెళ్లడం. మెత్తబడగానే సైడ్‌ చేయడం అనేవి చంద్రబాబు తరహా వ్యూహాలని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన తన పార్టీ కాబట్టి, తాను చెప్పిసట్లే జరగాలని పవన్‌ భావిస్తున్నారు. దీనిలో తప్పు లేదు. ప్రస్తుతం దేశంలో పేరుకే పార్టీలున్నాయి కానీ అంతా ఏకవ్యక్తి లేదా కొంతమంది పాలనలోనే నడుస్తున్నాయి. కాంగ్రెస్‌, భాజపా, తెలుగుదేశం, వైకాపా ఇలా ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. అవన్నీ ప్రజాస్వామ్యం అనే ముసుగు తొడుక్కుని నియంతృత్వాన్ని ఛలాయిస్తున్నాయి. ఈ లౌక్యం పవన్‌లో కొరవడుతోంది.

మిగిలిన పార్టీ అధినేతలంతా తమ పార్టీ పటిష్టం కోసం పని చేస్తుంటారు. అధికారంలో ఉంటే తాము కూడా లాభపడొచ్చని నాయకులు, కార్యకర్తలు ఆశిస్తారు. పార్టీ ఉనికి కోసం డబ్బులు ఖర్చు పెడతారు. జనసేన ఆవిర్భవించి దశాబ్దం దాటినా కార్యకర్తలకు ఎలాంటి లాభమూ లేదు. 2014లో పవన్‌ వల్ల తెదేపా అధికారంలోకి వచ్చినా పవన్‌ అనుయాయులు ప్రేక్షకులుగానే మిగిలిపోయారు. ఇటీవల లోకేష్‌ ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, అందరి మాట ఇదే అంటూ తేల్చి చెప్పారు. ఈ విషయంలో చర్చలకు తావే లేదన్నది ఆయన అభిమతం. సీనియర్‌ పార్లమెంటేరియన్‌ చేగొండి హరిరామజోగయ్య ఈ విషయమై పవన్‌ కళ్యాణ్‌ను ఓ లేఖలో నిలదీశారు. అధికారం చేపట్టి బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఆయన పరోక్షంగా హితవు పలికారు. పవన్‌ నుంచి మౌనమే సమాధానమైంది. .

తెలుగుదేశానికి సరెండర్‌ కావడం ద్వారా పవన్‌ అధికార పంపిణీపై చర్చలకు దారులు మూసేశారు. ఎన్నికల ముందు పదవుల పంపిణీపై భేటీ జరిగినా, అది నామమాత్రమే అవుతుంది. తెలుగుదేశం ఏమిస్తే అదే తీసుకునే పరిస్థితిలో ప్రస్తుతం జనసేన ఉంది. పొత్తును కాదని ఒంటరిగా పోటీ చేసే స్థాయిలో ఆ పార్టీ లేదు. ఓ రకంగా పవన్‌ ఇరకాటంలో ఉన్నారు. జగన్‌ ఓటమే జనసేనాని లక్ష్యం కాబట్టి, ఈ పరిస్థితిని ఆయన లైట్‌గా తీసుకుంటున్నట్లుంది. కానీ ఆయన అభిమానులు, కార్యకర్తలే బాధపడుతున్నారు. 

Tags:    

Similar News