ఇలా చేస్తే ఎలా....పవన్....?

Update: 2018-09-09 02:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ బ్రేక్ తీసుకున్నారు. పోరాట యాత్ర పేరిట ప్రజల్లోకి బయలుదేరిన పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ శాసనసభ రద్దయి పార్టీలన్నీ ఎన్నికల కోలాహలంలో ఉన్నాయి. తెలంగాణలో కూడా పోటీ చేస్తామన్న పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. తెలంగాణలోనూ ఆ పార్టీ ఎంపిక చేసిన జనసైనికులు పవన్ ఆదేశాల కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో.....

తెలంగాణలో పవన్ పార్టీ అసలు పోటీకి దిగుతుందా? లేదా? అన్న క్లారిటీ కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా జనసేనాని ఏర్పాటు చేశారు. ఇటీవలే సీపీఎం నేతలు పొత్తుల కోసం జనసేన నేతలతో చర్చలు కూడా జరిపారు. ఇంకా దీనిపై చర్చించాల్సి ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికలు ముందు వస్తున్నందున ఇక్కడ కూడా వామపక్ష పార్టీలతో కలసి వెళ్లాలన్నదే జనసేనాని ఆలోచన. ఇందుకోసం తెలంగాణలో టూర్ కు పవన్ రూట్ మ్యాప్ ను తయారు చేసుకుంటున్నారని కూడా తెలుస్తోంది.

పోరాట యాత్రకు విరామమిచ్చి......

ఇక దాదాపు పదిహేను రోజుల నుంచి పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కంటికి మరోసారి శస్త్ర చికిత్స జరగడంతో ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జనసేనాని ఏపీలో పోరాట యాత్రకు కొద్దిరోజుల పాటు విరామమిచ్చారు. ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ పర్యటనకు మంచి స్పందన లభించింది. ఉత్తరాంధ్ర పర్యటన తర్వాత ఆయన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పోరాటయాత్రను ప్లాన్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్దిరోజుల పర్యటన అనంతరం ఆయన విరామమిచ్చి హైదరాబాద్ కు వెళ్లిపోయారు.

విసిగిపోతున్న వామపక్షాలు.....

దీంతో జనసేన కార్యకర్తలు తీవ్ర నిరాశాలో మునిగిపోయారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో పవన్ కల్యాణ్ విరామమివ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఏపీలో పవన్ తో కలసి వెళదామనుకున్న వామపక్ష పార్టీలు కూడా పవన్ పోకడతో కొంత విసుగు చెందుతున్నాయని తెలుస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండాల్సిన సమయంలో పవన్ యాత్రలకు తరచూ విరామమివ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. సీరియస్ గా రాజకీయాలు చేయాల్సిన సమయంలో పవన్ ఇలా ప్రజలకు దూరంగా ఉండటం సరికాదన్నది వామపక్ష నేతల అభిప్రాయం. మరి రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పెరిగినా పవన్ లో మాత్రం ఆ దూకుడు కన్పించడం లేదు.

Similar News