చేయల్సిందంతా చేసి డొంకలో దాక్కుంటే పిడుగులు తప్పవని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులపై ఆయన పరోక్షంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై వస్తున్న ఆరోపణల నుంచి క్లీన్ గా బయటకు రావాలని పవన్ కల్యాణ్ అన్నారు. తెలుుదేశం పార్టీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగితే అది ప్రజల పై దాడి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ‘‘సైనికులు కవాతు చేస్తారు. సామాన్య ప్రజలు కవాతు చేయరు. కానీ ఎందుకు మనం కవాతు చేయాల్సి వచ్చింది. సమస్యల పరిష్కారం, హామీల అమలుకోసమే కవాతు చేశాం. సగటు రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయి, అవినీతితో నిండిపోయి, దోపిడీ వ్యవస్థను నిలువరించడానికే ఈ కవాతును నిర్వహించాం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనపై కవాతు నిర్వహించిన అనంతరం ఆయన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతను మోసగించారన్నారు.