ఏపీలో ఎన్నికలకి సమయం నాలుగు నెలలు కూడా గట్టిగా లేదు. ఒకపక్క అధికార టిడిపి, మరోపక్క ప్రతిపక్ష వైసిపి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను సైతం సిద్ధం చేసుకుని నిత్యం ప్రజల్లో ఉంటున్నాయి. ఇక మూడో పక్షంగా అవతరించిన జనసేన అధినేత పవన్ మాత్రం విదేశీ టూర్లలో బిజీ అయిపోయారు . దాంతో తమ లీడర్ ఎప్పుడొస్తారా అని సైన్యం ఎదురు చూస్తూ వుంది. ఒక పక్క తెలంగాణ ఎన్నికలు ముగిశాక ఎపి రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రతిరోజు ప్రతిగంట విలువైన నేపథ్యంలో జనసేనుడు టూర్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
ఫండ్ రైజింగ్ ... ఫ్యామిలీ టూర్ ...
అమెరికాలో పవన్ టూర్ ముగిసాకా ఇక ఎపి పాలిటిక్స్ లో పవన్ స్పీడ్ అవుతారనే అంతా అనుకున్నారు. అయితే ఆయన ఆ టూర్ తరువాత భార్య పిల్లలతో క్రిస్మస్ పండగ వేడుకకు యూరప్ టూర్ కి వెళ్లారు. ఈ టూర్ తరువాత పవన్ ఎపి పాలిటిక్స్ లో వేగం పెంచుతారని జనసేన వర్గాలు అంటున్నాయి. అమరావతి కేంద్రంగా ఆయన కార్యక్రమాలు సాగిస్తారని చెబుతున్నాయి. సంక్రాంతి పండగ తరువాత పూర్తి స్థాయిలో అమరావతి కేంద్రంగానే పవన్ కళ్యాణ్ తన కార్యకలాపాలను నిర్వహిస్తారని పార్టీ వర్గాలకు సమాచారం ఉందిట. ఒక పక్క పుణ్య కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ తన కార్యాచరణ ఏవిధంగా చేపడతారో చూడాలి