జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందా ..? అవునంటున్నారు జనసేనాని. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో పవన్ ఈ తన హత్యకు ముగ్గురు స్కెచ్ గీసేందుకు సిద్ధం అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు అధికార పార్టీనా ? విపక్షానికి చెందినవారా? అనేది తాను చెప్పలేనని వారెవరో తనకు తెలుసునని అన్నారు. తనను హత్య చేస్తే ఒక నెలరోజులపాటు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు ఈ హత్యను తోసేసుకుని రాజకీయ లబ్ది పొందాలని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమకు అడ్డుగా వున్న తనను తొలగించడం ద్వారా ఎవరో ఒకరు అధికారంలో కొనసాగవచ్చని ఆ ముగ్గురు చేసిన వ్యాఖ్యలను టేప్ చేసి ఒకరు వినిపించారన్నారు. ఇలాంటి వాటికి తాను భయపడేది లేదన్నారు పవన్. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరు చేసింది జనసేనాని బయటపెట్టకపోవడం చర్చనీయాంశం అయ్యింది.
గతంనుంచి ఇలాంటి వ్యాఖ్యలే ...
పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన నాటినుంచి సుమారుగా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు పలు సందర్భాల్లో చేస్తూ వచ్చారు. టిడిపి, బిజెపి తో జతకట్టినప్పుడు కూడా తాను ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చానని వ్యాఖ్యానిస్తూవుండేవారు. తాజాగా పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే పవన్ చేయడం విశేషం. గుంటూరు లో పవన్ టిడిపి ని వ్యతిరేకిస్తూ సభ పెట్టినప్పుడు పోలీసులను అదనపు భద్రత కోరారు. ఆ తరువాత సర్కార్ నియమించిన గన్ మ్యాన్ ల వల్ల తన వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని అనుమానించి వారిని వెనక్కు పంపారు.
విభిన్న వ్యాఖ్యలతో......
ఆ తరువాత వివిధ పర్యటనల్లో తన ప్రాణాలను ఫణంగా పెట్టి పార్టీ స్థాపించానని చెప్పుకొచ్చేవారు. ఇలా విభిన్న వ్యాఖ్యలతో పవన్ ఒక రకంగా తాను అభద్రతతో ఉన్నట్లు చెప్పక చెప్పినట్లు అయ్యింది. దాంతో ఆయన పదేపదే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనితోబాటు ప్రజలనుంచి సానుభూతి కూడా లభిస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు ఎదో ఒక్కసా,రో రెండుసార్లో చేస్తే ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటాయి. పదేపదే చేస్తే విలువ మరింత కోల్పోతారంటున్నారు విశ్లేషకులు. అన్ని వివరాలు తనవద్ద ఉన్నాయని అంటున్న పవన్ సత్యాన్ని ససాక్ష్యాలతో వెల్లడిస్తే నాయకుడిగా మరింత మెరుగుపడతారని అంటున్నారు విశ్లేషకులు.