జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కవాతు కలసి వచ్చినట్లే కన్పిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించే ముందు ధవళేశ్వరం బ్యారేజీపై జరిపిన కవాతుతో జనసేనలో జోష్ పెరిగింది. ఇదే ఫార్ములాను ఆయన రాయలసీమలోనూ ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు ఆయన రాయలసీమకు వెళుతున్నారు. అనంతపురం పట్టణంలో కవాతును నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పర్యటన చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రైళ్లలో, బస్సుల్లో....
ఉభయ గోదావరి జిల్లాల పర్యటనల్లో పవన్ విన్నూత్నంగా ప్రజల చెంతకు చేరారు. విజయవాడ నుంచి తుని వరకు రైల్లో ప్రయాణించారు. ఆ తర్వాత రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ రెండు కార్యక్రమాలు సూపర్ గా క్లిక్ అయ్యాయి. బస్సులు, రైళ్లల్లో ప్రయాణిస్తూ వివిధ వర్గాల ప్రజలను పవన్ కలుసుకున్నారు. వారితో మాటా మంతీచేశారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడంతో ఆయనకు కూడా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహన వచ్చినట్లయింది.
సేమ్ ఫార్ములాతో....
ఇదే తరహాలో రాయలసీమలోనూ పవన్ ప్రయాణించనున్నారు. నాలుగు జిల్లాల్లో బస్సులో కాని, రైల్లోకాని ప్రయాణించాలని ఆయన భావిస్తున్నారు. తొలుత అనంతపురం టౌన్ లో కవాతు నిర్వహించిన తర్వాత వివిధ వర్గాల ప్రజలతో సమావేశం అవుతారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు కరవుతో అల్లాడుతున్నాయి. ప్రధానంగా రాయలసీమలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడినే పవన్ టార్గెట్ చేయనున్నారు. రాయలసీమ కరువుతో అల్లాడుతున్నా ప్రజలకు మాయమాటలు చెప్పడం తప్పించి ఎవరూ చేసిందేమీ లేదని ఆయన చంద్రబాబు పై మండిపడనున్నారు.
జగన్, బాబులే టార్గెట్....
అలాగే రాయలసీమలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయిన వివిధ వేదికల ప్రతినిధులతోనూ పవన్ సమావేశమవుతారు. ఇప్పటికే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాయలసీమకు సంబంధించి సమస్యల చిట్టాను రూపొందించే పనిలో ఉన్నారు. రాయలసీమలో ఎలాగైనా పట్టు సంపాదించాలన్న ప్రయత్నంలో పవన్ ఉన్నారు. రాయలసీమలో జగన్ కు కూడా పట్టు ఎక్కువగా ఉంది. గత ఎన్నికల ఫలితాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఈసారి సీమ పర్యటనలో పవన్ బాబు, జగన్ లే టార్గెట్ గా పర్యటించనున్నారని తెలుస్తోంది. మరి రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఎలా దూసుకువెళుతుందో చూడాలి.