రేవంత్ ఒక్కడితోనే సాధ్యమా?
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమానంగా మాటలతో ఆకట్టుకోగలిగిన నేత. ఆయన ప్రయత్నం కొంత వరకే.
తెలంగాణలో కాంగ్రెస్ మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపినా తాము సిద్ధం అని చెబుతున్నా అది పైకి చెప్పే మాటే. ఏ నియోజకవర్గంలోనూ నాయకుడు రెడీగా లేరు. ఇప్పటి వరకూ జనంలోకి వెళ్లని నేతలే ఎక్కువ మంది కాంగ్రెస్ లో ఉన్నారు. హైదరాబాద్ కే పరిమితమయి నియోజకవర్గాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్వేలు చేయిస్తుందని చెబుతున్నా పెద్దగా పట్టించుకునే వారే లేరు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా? అన్న తాత్సారం వారిలో స్పష్టంగా కనపడుతుంది. గాంధీ భవన్ లో మీడియా మీట్ లకే పరిమితమవుతున్నారు.
హైదరాబాద్ లోనే..
రాహుల్ గాంధీ వరంగల్ సభలో స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గాల్లో తిరగని నేతలకు టిక్కెట్లు ఇవ్వబోమని ఖరాఖండీగా చెప్పారు. సర్వే ప్రాతిపదికనే టిక్కెట్ల కేటాయింపు జరుగుతుందని, నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు చేరువవ్వాలని చెప్పి వెళ్లారు. రాహుల్ వచ్చి దాదాపు ఆరు నెలలు గడుస్తుంది. మరోసారి కూడా రాహుల్ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతల పరిస్థితుల్లో మార్పు కన్పించడం లేదు. సీనియర్ నేతలందరూ హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. నియోజకవర్గాలకు అడపా దడపా వెళ్లి వస్తున్నారు తప్పించి అక్కడ పార్టీని బలోపేతం చేసుకుందామన్న ఆలోచన లేదు.
కొంత జోష్ పెరిగినా...
రేవంత్ రెడ్డి పీసీీసీ చీఫ్ గా వచ్చిన తర్వాత కార్యకర్తల్లో కొంత జోష్ పెరిగింది. ఒక ప్రధాన సామాజికవర్గం కాంగ్రెస్ కు అండగా నిలిచేందుకు సిద్ధమయింది. ఓటింగ్ శాతం కూడా పెరిగిందనే అంటున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో తెలంగాణలో నిలదొక్కుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ జనంలోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. తొలుత తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకోగలగాలి. జనంలో నమ్మకం కలిగించాలి. బీజేపీకి అంత సీన్ లేదని బలంగా సంకేతాలను ప్రజల్లోకి పంపగలగాలి.
నియోజకవర్గ స్థాయి నేతలు...
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమానంగా మాటలతో ఆకట్టుకోగలిగిన నేత. ఆయన ప్రయత్నం కొంత వరకే. పార్టీని మరింత బలోపేతం చేయాల్సింది నియోజకవర్గ స్థాయి నేతలే. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను తిరిగి దరి చేర్చుకుందామని నియోజకవర్గ స్థాయి నేతలు ప్రయత్నించడం లేదు. ఇప్పటి నుంచే ఖర్చు ఎందుకన్న ధోరణితో ఉన్నట్లే కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ గా చేసిన ప్రయోజనం నెరవేరకుండా పోతుంది. రేవంత్ రెడ్డి తరహాలో ప్రతి నియోజకవర్గంలో శాసనసభకు పోటీ పడే వ్యక్తి నిత్యం ప్రజాసమస్యలపై పోరాడటం, దూకుడుగా వెళితే తప్ప కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు.