కాలం కాని కాలాన పెథాయ్ తుఫాన్ వణికిస్తోంది. కాకినాడ తీరానికి 50 కిలోమీటర్లలో కేంద్రీకృతమైన తుఫాన్ గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు చొచ్చుకొస్తోంది. తుఫాను ప్రభావం నిన్నటి నుంచే మొదలైంది. నిన్నటి నుంచి కోస్తా జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కాకినాడ పోర్టులో ఇప్పటికే ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాను ప్రభావ ప్రాంతాల్లో ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పలు బస్సు సర్వీసులు సైతం రద్దు చేశారు. యానాంలో బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తీరప్రాంతం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీరప్రాంతాలకు రాకపోకలను నిలిపివేసింది. పలు రైలు సర్వీసులు కూడా రద్దయ్యాయి. కొనసీమ ప్రాంతానికి ముప్పు పొంచి ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే రక్షణ చర్యలు ప్రారంభించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కొందరిని షెల్టర్ లకు తరలిస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు.