అల్లూరి అందరికీ స్ఫూర్తి...తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ
అల్లూరి సీతారామరాజును స్మరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి పాత్ర విశిష్టమైనదని అన్నారు.
అల్లూరి సీతారామరాజును స్మరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి పాత్ర విశిష్టమైనదని అన్నారు. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125 శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగు వీర లేవరా.. దీక్ష బూని సాగరా అని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుద్ధవీరుడు అల్లూరి అని ఆయన అన్నారు. యావత్ దేశానికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. ఏడాది కాలం అల్లూరి సేవలను సర్మించుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ఆంధ్ర గడ్డ మీదకు...
ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడకు రావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. రంప ఆందోళన చేపట్టి నేటికి వందేళ్లు పూర్తయిందని మోదీ అన్నారు. అల్లూరి పుట్టిన భూమికి రావడం తన అదృష్టమన్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ లో భాగంగా మహనీయుల సేవలను స్మరించుకుంటున్నామని చెప్పారు. ఆదివాసీ బిడ్డలందరీకి తన శుభాభినందనలు అని తెలిపారు. ఆదివాసీలు ధైర్యానికి ప్రతీక అని అన్నారు. ఒకే దేశం ఒకే భావన అన్నది ఆనాటి నుంచే ప్రారంభమయిందని చెప్పారు.
అందరికీ ప్రేరణ ...
సీతారామరాజు జీవితం మనందరికీ ప్రేరణ కావాలని మోదీ అన్నారు. ఆయన తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారని చెప్పారు. మనదే రాజ్యం అన్న నినాదంతో ప్రజలందరీని ఒక తాటిపైకి అల్లూరి తెచ్చారన్నారు. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మోదీ అన్నారు. చిన్న వయసులోనే ఆయన దేశం కోసం ప్రాణాలను అర్పించారన్నారు. రంప ఆందోళనలో ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆంధ్ర పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారాన్నారు. కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం వంటి వారికి జన్మనిచ్చిన గడ్డ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని స్మరించుకోవాలన్నారు.
ఆదివాసీల అభివృద్ధికి...
మహనీయుల కలలకు అనుగుణంగా గత ఎనిమిదేళ్లలో ఆదివాసీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. స్వతంత్ర సంగ్రామంలో ఆదివాసీల బలిదానాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. ఇందుకోసం కేంద్రం ఆదివాసీల కోసం మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యువత అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అల్లూరికి దేశం తరుపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు మోదీ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 90 అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఈ సందర్భంగా ఆవిష‌్కరించారు. అల్లూరి వారసులను ఆయన సత్కరించారు.