పాలేరు... అక్కడ పోటీకి దిగితే ఇక అంతే

పాలేరులో ఇప్పటికే పాలిటిక్స్ హీటెక్కాయి. అన్ని పార్టీల నేతలకుకు పాలేరు చిరునామాగా మారనుంది.

Update: 2022-12-16 03:36 GMT

పాలేరులో పోటీ ఈసారి సామాన్యంగా ఉండేలా లేదు. హేమాహేమీలు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలేరులో ఇప్పటికే పాలిటిక్స్ హీటెక్కాయి. అన్ని పార్టీల నేతలకుకు పాలేరు చిరునామాగా మారనుంది. అందరూ అక్కడ పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అన్ని పార్టీల్లోని ప్రముఖులు పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్నారు. పాలేరులో గెలిచి శాసనసభలో అడుగు పెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా పాలేరు టిక్కెట్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.


తుమ్మల పోటీ చేసి...

పాలేరు నుంచి గతంలో తుమ్మల నాగేశ్వరరావు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తుమ్మల రాజకీయంగా ఖాళీగానే ఉన్నారు. 2014లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కేసీఆర్ 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మలను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన కూడా టీఆర్ఎస్ లోనే ఉండి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తాను పోట ీ చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతెలిపారు.

టీఆర్ఎస్ లోకి...
కానీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. సిట్టింగ్ లకే టిక్కెట్ అని కేసీఆర్ ప్రకటించినా సర్వేల ఆధారంగానే ఆయన టిక్కెట్ల కేటాయింపు చేస్తారంటున్నారు. ఉపేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఎవరో ఒకరికి పాలేరు టిక్కెట్ కేటాయించాల్సి ఉంటుంది. అదీ కాకుంటే తాము పోటీకి సిద్ధమని కమ్యునిస్టు సిద్ధమవుతున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తారంటున్నారు. ఇప్పటికే వామపక్షాలతో కలసి వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పొత్తులో భాగంగా పాలేరు సీటు సీపీఎం కోరితే వారికి ఇవ్వకతప్పదు. మరి అప్పుడు మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన అయితే ఇరు వర్గాల్లో ఉంది.

వైఎస్ షర్మిల కూడా...
ఇక వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 16న అక్కడ పార్టీ కార్యాలయానికి భూమి పూజ కూడా చేయనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా ఆమె పాలేరులో గెలుపొందాలని, ఇదే తనకు సరైన నియోజకవర్గమని ఆమె నిర్ణయించుకున్నారు. పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తూ షర్మిల తరుపున ప్రచార చేస్తుంది. రెడ్డి, ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో అక్కడ గెలుపు తనకు సులువవుతుందని షర్మిల భావిస్తున్నారు. కొందరు కీలక నేతలతో కూడా షర్మిల సంప్రదింపులు జరిపి తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఒక కీలకనేత, అధికార పార్టీలో ఉన్న నేత ఒకరు లోపాయికారీగా షర్మిలకు సాయం చేేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. వీరిద్దరూ వైఎస్ కుటుంబం వల్ల లబ్ది పొందిన వారే. ఇలా అన్ని పార్టీల నేతలు పాలేరు వైపు చూస్తున్నారు.


Tags:    

Similar News