ఎన్నికల శంఖారావంగా భావిస్తున్న టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 25 లక్షల మందితో సభను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అంతే భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా పది రోజులుగా సభ జరిగే హైదరాబాద్ శివార్లలోని కొంగర కలాన్ లో మకాం వేసి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
నాలుగున్నరేళ్ల ప్రగతి నివేదన
నాలుగున్నరేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సభ ద్వారా ప్రజల ముందుంచాలనేది టీఆర్ఎస్ పార్టీ ఆలోచన. ఈ సభ ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేసి ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రెండు గంటల పాటు ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం చేయాలని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో చేయని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విధానాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రచారం చేస్తూ కొంగరకలాన్ తో పాటు హైదరాబాద్ నగరమంతా హోర్డింగులు వేస్తున్నారు. సభకు వచ్చే అన్ని దారుల్లో పెద్దఎత్తున ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. దీంతో సభా ప్రాంగణంతో పాటు నగరం మొత్తానికి గులాబీ శోభ వచ్చింది.
భారీగా జన సమీకరణే లక్ష్యంగా...
ఎన్నికల వేళ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాటుచేస్తున్న ప్రగతి నివేదన సభకు భారీగా జనసమీకరణ చేసేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ పెద్దలు శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 25 వేల మంది చొప్పున ప్రజలను సభకు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి రెట్టింపు సంఖ్యలో జనసమీకరణ చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాలకు టార్గెట్లు కూడా ఇచ్చేశారు. ఇక రైతులను ఆకట్టుకునే లక్ష్యంతో ఉన్న టీఆర్ఎస్ ఎక్కువగా గ్రామీల నుంచే జనసమీకరణ చేయాలని, రైతులకు పెద్ద ఎత్తున తరలించాలని పార్టీ నాయకులకు సూచించింది. రేపే అన్ని జిల్లాల నుంచి 10 వేల ట్రాక్టర్ల ద్వారా సభకు పయనం అయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి సభా ప్రాంగణం వద్దే భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు.
23 వేల మంది పోలీసులతో...
ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగరకలాన్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద 1600 ఎకరాల స్థలం ఈ సభకు వేదికయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సభా ప్రాంగణానికి చేరుకునే సమయంలో ఇబ్బందులు కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేకంగా రోడ్లు వేస్తున్నారంటే సభ నిర్వహణ ఎంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుందో తెలుసుకోవచ్చు. వేదికపైన పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు మొత్తం సుమారు 500 మంది కూర్చునేలా భారీ వేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెలీకాఫ్టర్ ద్వారా రానున్నందున వేదిక వెనుక వైపు ప్రత్యేకంగా హెలీప్యాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక పెద్దసంఖ్యలో ప్రజలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 23వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇవాళటి నుంచే పోలీసులు సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ యాప్ నే ఏర్పాటుచేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.