ఫీవర్...ఫేవర్ చేసుకుంటారా..?

Update: 2018-09-02 02:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమరోత్సాహంతో ముందుకుపోతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే కచ్చితంగా తిరుగులేని విజయం సాధిస్తానని నమ్మకంగా ఉన్న ఆయన పార్టీ శ్రేణులను కూడా ఈ దిశగా సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కనీవినీ ఎరుగని రీతిలో ‘ప్రగతి నివేదన సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సభకు 25 లక్షల మందిని సమీకరించి ఘన విజయం చేయాలని భావిస్తోంది. అయితే, అసలు ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ వ్యూహమేంటీ..? ఎన్నికలపై సభా వేదికగా ఏదైనా కీలక ప్రకటన చేస్తారా..? అసలు ప్రజలకు ఏమి సందేశం ఇవ్వనున్నారు..? అనే ప్రశ్నలు ఉత్కంఠకు తెరలేపుతున్నాయి.

ఇప్పటికే వరాలజల్లు..!

గత నెల రోజులుగా కేసీఆర్ వడివడిగా వేస్తున్న అడుగులు రాష్ట్రంలో ఒక్కసారిగా ఎలక్షన్ ఫీవర్ తీసుకువచ్చాయి. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు, ఢిల్లీ పర్యటనలు ముందస్తు ప్రచారం నిజమే అనేలా ఉన్నాయి. ఇక ఇటీవలి కాలంలో ఎక్కువమంది ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంతో రైతుబందు, రైతుబీమా, కంటి వెలుగు వంటి పథకాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రజల్లో టీఆర్ఎస్ కు సానుకూల పవనాలు ఉన్నాయనే విశ్లేషణలు ఉన్నారు. ఇక మరిన్ని హామీలు కూడా ఆయన ప్రకటిస్తున్నారు. నిన్న విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైన ఆయన వారికి వరాల జల్లు కురిపించారు. ఇక నూతన జోనల్ వ్యవస్థను ఆయన ఢిల్లీ చుట్టూ తిరిగి పట్టుబట్టి ఆమోదముద్ర వేయించారు. ఇక నిరుద్యోగుల అసంతృప్తి పోగొట్టే ఉద్దేశ్యంతో ఇటీవలి కాలంలో పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు.

క్యాబినెట్ భేటీ లో కీలక నిర్ణయాలు..?

ఇక భారీ బహిరంగసభకు కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేయడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఈ క్యాబినెట్ భేటీలో ఆయన ఏం మాట్లాడనున్నారు, ఏయే నిర్ణయాలు తీసుకోనున్నారు అనే ఉత్కంఠ ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 10 లోపే అసెంబ్లీ రద్దు చేస్తేనే డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయనే అంచనాలు ఉన్నందున క్యాబినెట్ సమావేశంలో లేదా బహిరంగ సభలో అటువంటి ప్రకటన చేసే అవకాశం కనపడుతోంది. ఇక వివిధ పెండింగ్ అంశాలతో పాటు కొత్తగా వివిధ వర్గాలకు వరాలజల్లు కురిపించే అవకాశం ఉంది.

కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ...

క్యాబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు నేరుగా కొంగర కలాన్ లో జరిగే ప్రగతి నివేదన సభకు వస్తారు. అయితే, ముఖ్యమంత్రి రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. ఇందులో నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం ఎటువంటి విజయాలు సాధించింది, మ్యానిఫెస్టో అమలు చేసిన తీరు, మ్యానిఫెస్టోలో లేకున్నా ప్రవేశపెట్టిన పథకాలు, రాష్ట్రం సాధించిన వృద్ధి వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. ఇక క్యాబినెట్ భేటీలో తీసుకోనున్న కీలక నిర్ణయాలను కూడా ప్రకటించనున్నారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చి ఎన్నికల శంఖారావం మొగించనున్నారు. ఇక ప్రతిపక్షాలపై తన మార్క్ ప్రసంగంతో విరుచుకుపడే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంది. చివరగా ఎన్నికలపై ఆయన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లోనే ఎన్నికలు వస్తాయని కేసీఆర్ స్పష్టం చేస్తారని సమాచారం.

Similar News