జూన్ నెలలోనే ప్రణయ్ ను చంపేందుకు మారుతీరావు స్కెచ్ వేశారని నల్లగొండ ఎస్పీ రంగనాధ్ చెప్పారు. మారుతీరావు ప్రణయ్ ను చంపేందుకు లోకల్ రాజకీయ నేత కరీం సలహాతో నేరగాళ్లతో చర్చలు జరిపారు. అస్గర్, బారీలతో ప్రణయ్ ను చంపేందుకు ఒప్పందం కుదిరింది. తొలుత ప్రణయ్ ను చంపాలంటే రెండు కోట్ల వాళ్లు డిమాండ్ చేశారు. అయితే మారుతీరావు మాత్రం కోటి రూపాయలు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ కింద వాళ్లు యాభై లక్షలు ఇవ్వాలని కోరితే, పదిహేను లక్షలు మాత్రమే ఇస్తానని మారుతీరావు చెప్పాడన్నారు. దీంతో రామోజీ ఫిలింసిటీ వద్ద పదిహేను లక్షల అడ్వాన్స్ సొమ్ము నిందితులకు మారుతీరావు ఇచ్చారు. అయితే బీహార్ కు చెందిన క్రిమినల్ సుభాష్ శర్మతో డీల్ ముగించాలని నిర్ణయించారు.
బీహార్ నుంచి వచ్చి.......
బీహార్ నుంచి సెప్టంబరు 14న సుభాష్ శర్మ మిర్యాలగూడకు వచ్చారన్నారు. అస్గర్ డైరెక్షన్ లోనే ప్రణయ్ మర్డర్ ప్లాన్ వేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆగస్టు 9వ తేదీ నుంచే ప్రణయ్ ను చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 9నే చంపాలనుకున్నారని, ప్రణయ్ తన భార్య తమ్ముడితో బ్యూటీ పార్లర్ కు వచ్చినప్పుడు చంపాలని అస్గర్, బారీ ప్లాన్ చేశారు. అయితే వారిద్దరిలో ప్రణయ్ ఎవరో తెలియక మర్డర్ ప్లాన్ ను వాయిదా వేశారని ఎస్పీ తెలిపారు. సెప్టంబరు మొదటి వారంలో కూడా మర్డర్ ప్లాన్ అమలు చేసేందుకు ప్రయత్నించారన్నారు. ప్రణయ్ ను చంపిన రోజున సుభాష్ శర్మ ఒక్కరే ఉన్నారు. అస్గర్ దూరంగా ఉండి డైరెక్షన్ చేశారని ఎస్పీ తెలిపారు. మారుతీరావు అక్రమాస్తులు, భూకబ్జాలపై విచారణ జరుపుతున్నామని నల్లగొండ ఎస్పీ రంగనాధ్ తెలిపారు.