తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ప్రతిభా భారతి ఈరోజు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవనున్నారు. రేపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రుమురళి టీడీపీలో చేరుతుండటంతో ప్రతిభా భారతి చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొండ్రుమురళి రాకను తొలి నుంచి ప్రతిభా భారతి వ్యతిరేకిస్తున్నారు. అయినా పార్టీలోకి తీసుకోవడం పట్ల ఆమె మనస్తాపానికి గురయ్యారు.
భవిష్యత్ కార్యాచరణకోసమేనా?
తన అనుచరులతో సమావేశమైన ప్రతిభా భారతి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసుకున్నారు. కొండ్రు మురళి చేరికతో తన స్థానమేంటో తెలియజేయాలని ఈ సందర్భంగా చంద్రబాబును ప్రతిభాభారతి కోరనున్నట్లు తెలిసిింది. చంద్రబాబు నుంచి వచ్చే హామీ మేరకే ప్రతిభ తదుపరి అడుగు వేయాలని భావిస్తున్నారు. ప్రతిభ అనుచరుల నుంచి మాత్రం పార్టీలో ఉండి ఏం సాధిస్తామన్న ప్రశ్నలు వస్తుండటంతో ఈరోజు ప్రతిభా భారతి చంద్రబాబును కలిసి చర్చించనున్నారు. రేపు కొండ్రుమురళి చేరుతుండటం, ఈరోజు ప్రతిభా భారతి చంద్రబాబుతో సమావేశం అవుతుండటం రాజాం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
కళాపై ఫిర్యాదుతో.....
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు తనను టార్గెట్ చేశారంటూ ఈ సందర్భంగా ప్రతిభా భారతి చంద్రబాబుకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా రాజాం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ఒక నివేదిక రూపంలో కూడా ప్రతిభా భారతి రూపొందించుకుని పక్కా ఆధారాలతో చంద్రబాబుతో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా కళా వెంకట్రావు అనుచరులు తనను ఎలా అడ్డుకుంటుందీ ప్రతిభాభారతి పూసగుచ్చినట్లు వివరించనున్నారు. మొత్తం మీద ప్రతిభ ఫిర్యాదుకు చంద్రబాబునాయుడు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.