మోదీ vs కేసీఆర్ .. రేపు ఏం జరగబోతోంది?
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లడం లేదు
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. అయితే ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లడం లేదు.. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. అలాగే వీడ్కోలు పలకనున్నారు. ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గతంలోనూ ప్రధాని రాక సందర్భంగా కేసీఆర్ స్వాగతం, వీడ్కోలు కార్యక్రమానికి హాజరు కాలేదు. సాధారణంగా ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ముఖ్యమంత్రి, గవర్నర్‌లు సాదర స్వాగతం పలుకుతారు. అది సంప్రదాయంగా వస్తున్నదే.
గత కొద్ది రోజులుగా...
అయితే గత కొద్ది రోజులుగా బీజేపీపైనా, మోదీ ప్రభుత్వంపైన కేసీఆర్ విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వానికి మరింత దూరమయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తామని బీజేపీ నేతలంటుండగా, బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ఢంకా భజాయించి చెబుతున్నారు. గవర్నర్‌తోనూ పొసగడం లేదు. రాజ్‌భవన్‌లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ కేసీఆర్ సర్కార్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దూరంగానే కేసీఆర్...
రేపు ఉదయం ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుప్థాపనలు, జాతికి అంకితం చేయడం వంటి పనులు చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతటితో ఆగకుండా ప్రధానికి తమ నిరసనలు తెలియజేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సింగరేణిని ప్రయివేటు పరం చేయాలన్న యోచనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించాలని బీఆర్ఎస్ ఇప్పటికే పిలుపు నిచ్చింది.
ఒకరిపై ఒకరు విమర్శలు...
మరో వైపు బండి సంజయ్‌ను పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎలాంటి ప్రసంగం చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కేసీఆర్ సర్కార్‌పై మోదీ నేరుగా విమర్శలు చేసే అవకాశముందని చెబుతున్నారు. కేసీఆర్ టార్గెట్‌గానే మోదీ ప్రసంగం సాగుతుందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీడియా సమావేశం పెట్టి ఆయనపై ఫైర్ కానున్నారని తెలిసింది. మొత్తం మీద ఎనిమిదో తేదీన మోదీ పర్యటన సందర్భంగా ఏం జరుగుతుందన్న ఉత్కంఠ, ఆసక్తి సర్వత్రా నెలకొంది.