పంజాబ్ లో పండగ పూట పెను విషాదం చోటు చేసుకుంది. విజయదశమి రోజు రావణ దహనం కార్యక్రమంలో రైలు ప్రమాదంలో 64 మంది ని మృత్యువు కబళించింది. పంజాబ్ లోని అమృత్ సర్ కి సమీపంలోని జోడా ఫాట్ దగ్గర ప్రతి ఏడులాగే మైదానంలో రావణ దహనం ఉత్సహంగా సాగుతుంది. ఈ కార్యక్రమం జరిగే సమీపంలో వున్న రైలు ట్రాక్ పై స్థానికులు పెద్ద ఎత్తున చేరారు. రావణుడిపై క్రాకర్స్ వున్న బాణం వెళ్ళింది. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుళ్లతో రావణ దహనం సాగుతుంది. ఈలోగా జలంధర్ నుంచి అమృతసర్ వెళుతున్న రైలు ట్రాక్ పైకి వేగంగా దూసుకువెళ్లింది. ట్రాక్ పై ఆ సమయంలో వున్న వారికి బాణాసంచా శబ్దాల కారణంగా రైలు వేస్తున్న విషయం గమనించలేదు. దాంతో జనం పై నుంచి దూసుకుపోయింది రైలు.
ప్రమాదస్థలి నుంచి వెళ్లిపోయిన సిద్ధూ ...
రైలు ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో పంజాబ్ మంత్రి నవజ్యోత్ సిద్ధూ, ఆయన భార్య కౌర్ తో పాటు ఆ ప్రాంత స్థానిక ఎమ్యెల్యే వారిద్దరూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కానీ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలిసిన మంత్రి సిద్ధూ కారెక్కి తనకేమి పట్టనట్లు వెళ్లిపోవడం తో ఆయనపై ఒక్కసారిగా విమర్శలు పెల్లుబికాయి. మరోపక్క ప్రమాదం పై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి హోమ్ మంత్రి రాజ్ నాధ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి క్షతగాత్రులకు తక్షణ సాయానికి ఆదేశించారు.
సెల్ఫీలు ప్రాణాలు తీశాయా ...?
ఇటీవల కాలంలో సెల్ఫీలు వీడియోల ప్రభావంలో అంతా మునిగితేలి ప్రాణాలు పోగొట్టుకొంటున్న సంఘటనలు పెరిగిపోయాయి. తాజా ప్రమాదంలో కూడా మృతుల్లో క్షతగాత్రుల్లో వున్నవారు పలువురు సెల్ఫీ ఫోటోలు వీడియోలు తీసుకునే హడావిడిలో తమవైపు దూసుకొస్తున్న మృత్యువును గుర్తించలేకపోయారు. ఫలితం తీవ్ర నష్టం క్షణాల్లో వాటిల్లింది. మరో పక్క అటు రైల్వే అధికారులకు ముందస్తు సమాచారాన్ని నిర్వాహకులు ఇవ్వకపోవడం, పోలీసులతో ట్రాక్ పై పహారా లేకపోవడం వంటి నిర్లక్ష్యాలు కూడా ఈ పెను విషాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు.