కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో సఖ్యతగా మెలగాలన్నది భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యమని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ మిత్రధర్మం పాటించడంలో ముందున్నామన్నారు. గుంటూరు లో రాజ్ నాధ్ సింగ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ, జవహార్ లాల్ నెహ్రూలు కూడా సంకీర్ణ ప్రభుత్వాలను నడపలేదని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలిగారన్నారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ఈరోజు దేశాభివృద్ధికి కారణమన్నారు. అలాంటి పీవీ నరసింహారావును బీజేపీ నిత్యం స్మరించుకుంటూనే ఉంటుందని, పీవీ చనిపోతే కనీసం దహనసంస్కరాలు చేయడానికి కూడా వీలులేకుండా కాంగ్రెస్ కఠినంగా వ్యవహరించడాన్ని మర్చిపోలేమన్నారు. పీనీని కాంగ్రెస్ అవమానించిందన్నారు. నెహ్రూ కుటుంబంలో ఉన్నవారినే కాంగ్రెస్ గౌరవిస్తుందని, ఇతర నేతలను గుర్తించందని అన్నారు. కానీ బీజేపీ మాత్రం అందరీని గౌరవిస్తుందన్నారు. బీజేపీ వల్లనే సుస్థిర పాలన సాధ్యమవుతుందన్నారు.