పీసీసీ చేతుల్లో ఏమీ లేదట

అభ్యర్థుల ఎంపిక పీసీసీ చేతుల్లో కూడా ఉండదని, సర్వేలను బట్టి నిర్ణయిస్తామని రాహుల్ క్లారిటీ ఇచ్చారని తెలిసింది

Update: 2022-04-07 02:35 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మూడోసారి అయినా విజయం దక్కించుకుంటుందా? ఇందుకోసం వ్యూహకర్త సునీల్ ఏం చేయబోతున్నారు? అనే చర్చ పార్టీలో సాగుతుంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగింది. 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తమ పార్టీ కనుక తమకు ఓటు వేయాలని కాంగ్రెస్ కోరింది. చివరకు రాష్ట్రాన్ని శ్రమకోర్చి ఇచ్చిన సోనియా గాంధీతో కూడా బహిరంగ సభను ఏర్పాటు చేసినా ఫలితం కన్పించలేదు.

స్థానిక నాయకత్వమే.....
2014, 2018 ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి కాంగ్రెస్ స్థానిక నాయకత్వం కారణమని హైకమాండ్ భావిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా స్థానిక నాయకులు తమకు సరైన సమాచారం ఇవ్వలేదని, ఖచ్చితంగా గెలుస్తామని తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించారని హైకమాండ్ నమ్ముతోంది. అందుకే ఈసారి అలా హైకమాండ్ కూడా స్థానిక నాయకత్వానికి ఎన్నికల ప్రక్రియను అప్పగించే పరిస్థిితి కన్పించలేదు.
నివేదికల ప్రకారం....
ప్రశాంత్ కిషోర్ టీంలో మొన్నటి వరకూ సభ్యుడిగా ఉన్న సునీల్ ను కాంగ్రెస్ ఎన్నిలక వ్యూహకర్తగా నియమించుకున్నారు. సునీల్ బ్యాచ్ రాష్ట్రమంతటా పర్యటించి పార్టీ పరిస్థితి, గెలవగలిగిన నియోజకవర్గాలపై ఒక నివేదికను అందచేయనుంది. అలాగే అభ్యర్థుల ఎంపిక పై కూడా సునీల్ బృందం సర్వేలు చేసి హైకమాండ్ కు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వనుంది. సునీల్ ఇచ్చే నివేదికల ప్రకారమే ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అంటున్నారు.
చేరికలపై....
ఇటీవల రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయినప్పుడు కూడా అదే చెప్పారని తెలిసింది. నేతల మధ్య సమన్వయం ఉండాలని, అభ్యర్థుల ఎంపిక పీసీసీ చేతుల్లో కూడా ఉండదని, సర్వేలను బట్టి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయం జరిగిపోతుందని ఆయన క్లారిటీ ఇచ్చారని తెలిసింది. ముఖ్యంగా సునీల్ స్ట్రాటజీ ప్రకారం రానున్న రోజుల్లో కాంగ్రెస్ లో చేరికలు ఉండాలి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి పెద్దయెత్తున వలసలు ఉండేలా చూడాలి. ఈ పనిని కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ అప్పగించినట్లు తెలిసింది. అధికార పార్టీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకుని మానసికంగా దెబ్బకొట్టడమే కాకుండా కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపాలన్నది ప్రధాన ఆలోచన. మరి సునీల్ వ్యూహం ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News