ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంబేద్కర్ పేరెత్తడమే ఇష్టం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందుకే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు మార్చారన్నారు. అంబేద్కర్ ను కేసీఆర్ అవమానపర్చారన్నారు. తెలంగాణలో ఏ పథకానికీ కేసీఆర్ అంబేద్కర్ పేరును పెట్టలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భైంసాలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తన ప్రసంగంలో రాహుల్ కొమురం భీంను తలచుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన గడ్డమీద వారి హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారన్నారు.
రీ డిజైన్ల పేరుతో కోట్లు.....
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణలో కేసీఆర్ లు రైతులకు అన్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడటమే కన్పిస్తుందన్నారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలను కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. రీ డిజైన్ల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుతింటున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం కోట్లు దండుకుంటోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ అధికారంలోకి రాగానే మర్చిపోయారన్నారు.
కేసీఆర్ చెప్పింది చేశారా?
తెలంగాణలో వేలాది మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. గిట్టుబాటు ధర అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. మద్దతు ధరను కూడా కల్పిస్తామన్నారు. కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్ రూం ఇళ్లు మీకు వచ్చాయా? అని రాహుల్ సభలో ప్రశ్నించారు. ప్రతి కుటుంబానికి ఉద్యోగమిస్తామన్న కేసీఆర్ యువతను కూడా మోసం చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రధానిగా కాకుండా కాపలాదారుగా ఉంటానని చెప్పారని, అయితే అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యాలకు కాపలాదారుగా ఉన్నారని విమర్శించారు.