పప్పు అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరే గుర్తుకు వస్తారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎపి మంత్రి నారా లోకేష్ లను వారి ప్రత్యర్ధులు చేసే విమర్శల్లో పప్పు పదం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సోషల్ మీడియా లో సైతం పప్పు అంటూ వీరిపై సెటైర్లు, పేలుతూ ఉంటాయి. ఇప్పుడు అలా వెటకారంగా పప్పు అనేవారికి నిప్పులా చెలరేగుతున్న రాహుల్ గాంధీ ని చూసి నోటమాట రావడం లేదు. ఇక సొంత పార్టీ వారికి రాహుల్ చేస్తున్న ప్రసంగాలు అంతా ఇంతా జోష్ పెంచడం లేదు. తమ అధినేత ప్రత్యర్థులపై చెలరేగుతున్న తీరు వారిని తబ్బి ఉబ్బబ్బయ్యేలా చేస్తుంది.
సూటిగా సుత్తి లేకుండా ...
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ భైంసా, కామారెడ్డి, చార్మినార్ పర్యటనల్లో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు సూటిగా సుత్తి లేకుండా ప్రత్యర్థులకు వణుకు పుట్టించేలా సాగాయి. రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేని కేసీఆర్ నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి డబ్బులు లేవు. అదే గులాబీ బాస్ భవనానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, 100 రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తానని ఏమి చేశారని ప్రశ్నించారు.
సందర్భోచితంగా......
ప్రాజెక్టుల రీడైజైనింగ్ పేరుతో డబ్బు ఎలా దోచేశారో, ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదనే అంశం, ప్రధాని మోడీ తో కెసిఆర్ అంటకాగుతున్నారంటూ నోట్ల రద్దు వంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలకు కెసిఆర్ మద్దత్తు ఇచ్చిన అంశాన్ని ఎత్తి చూపుతూ ఆ రెండు పార్టీలు ఒకటే అనే సంకేతాలు పంపారు రాహుల్. ఎంఐఎం సైతం మోడీ వైపే ఉందంటూ ముస్లిం మైనారిటీ ఓట్లకు గాలం వేశారు రాహుల్. ఇలా అనేక కీలక అంశాలను సందర్భోచితంగా ప్రస్తావిస్తూ చెలరేగిన కాంగ్రెస్ అధినేత పర్యటన ఇప్పుడు కాంగ్రెస్ లో రెట్టింపు బలం పెంచింది.