రేపు తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజీకి వెళ్లనుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తరుపున ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఒక విడత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ సయితం ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున ఆ పార్టీ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు ఎనిమిది సభల్లో పాల్గొంటూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ ఆయన ప్రచారంలో దూసుకువెళుతున్నారు.
కొడంగల్ లోనూ.....
ఇక రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్ షోలు, బహిరంగసభలతో హోరెత్తించనున్నారు. ఈ సభల్లో రాహుల్ గాంధీతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సయితం పాల్గొంటున్నారు. ఖమ్మం, కొడంగల్, హైదరాబాద్ లలో జరిగే సభలు, రోడ్ షోలలో రాహుల్, చంద్రబాబు తొలిసారిగా పాల్గొంటున్నారు. దీంతో ప్రజాకూటమికి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే రాహుల్, చంద్రబాబు సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.