గెహ్లాత్ వారసుడు.. ఎవరు?
ఈరోజు రాజస్థాన్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
డిసైడ్ అయిపోయింది. అశోక్ గెహ్లాత్ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఖాయమైంది. శశిథరూర్ వంటి నేతలు పోటీలో ఉన్నప్పటికీ గాంధీ కుటుంబం మద్దతుతో సుదీర్ఘ కాలం తర్వాత అశోక్ గెహ్లాత్ గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. సీతారాం కేసరి తర్వాత ఏఐసీసీకి అధ్యక్ష పదవికి గాంధీయేతర కుటుంబం నుంచి ఒకరు ఎన్నిక కాబోతున్నారు. 1996 నుంచి 1998 వరకూ సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకు ముందు పీవీ నరసింహారావు 1992 నుంచి 1994 వరకూ అధ్కక్షుడిగా పనిచేశారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం పీవీ ఈ పదవిని చేపట్టారు.
25 ఏళ్ల తర్వాత...
1998లో అధ్యక్ష పదవి చేపట్టిన సోనియా గాంధీ ఇప్పటి వరకూ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మధ్యలో 2017 నుంచి 2019 వరకూ రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగారు. కానీ 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగానే సోనియా గాంధీ కొనసాగుతున్నారు. దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత గాంధీ కుటుంబం కాకుండా ఇతరులు అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. దేశమంతా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీని తిరిగి అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటుంటే ఆయన మాత్రం అందుకు అంగీకరించడం లేదు.
ఒక వ్యక్తికి ఒకే పదవి...
సరే.. ఇదిలా ఉంటే అశోక్ గెహ్లాత్ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు వంద శాతం అవకాశాలున్నాయి. ఇందుకు గాంధీ కుటుంబం అండదండలు ఉండటమే కారణం. ప్రస్తుతం అశోక్ గెహ్లాత్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ పదవికి ఎన్నికయితే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనిపై రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టేశారు. ఉదయ్‌పూర్ లో జరిగిన చింతన్ తీర్మానం ప్రకారం ఒక వ్యక్తి ఒకే పదవిలో ఉండాలి. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం ఖాయమయిపోయింది.
పైలట్ vs జోషి...
ఈరోజు రాజస్థాన్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. స్పీకర్ జోషి, యువనేత సచిన్ పైలట్ లు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. ఈ సమావేశానికి పరిశీలకుడిగా సీినియర్ నేత మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ కూడా హాజరవుతున్నారు. వచ్చే ఏడాది రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బలమైన నేతను ముఖ్యమంత్రి పదవిలో నియమిస్తారని భావిస్తున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత ఇష్టుడు, మిత్రుడు అయిన సచిన్ పైలట్ కే ఎక్కువ అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేరళలో పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం ఢిల్లీకి వచ్చి సోనియాతో సమావేశమై దీనిపై క్లారిటీగా చెప్పేశారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తేవాలంటే సచిన్ పైలట్ ను మాత్రమే ముఖ్యమంత్రి చేయాలని రాహుల్ ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.