బ్రేకింగ్ : గులాబీకి గుడ్ బై...?

Update: 2018-09-07 06:20 GMT

శాసనసభ రద్దు...అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు ప్రకటన గులాబీ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు దక్కకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన రమేష్ రాథోడ్ కొంతకాలం క్రితం పార్టీలో చేరారు. ఆయన ప్రగతి భవన్ కు మందీమార్బలంతో వచ్చి కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన రమేష్ రాథోడ్ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. అయితే రాష్ట్ర విభజనతో తెలుగుదేశం పార్టీ పట్టుకోల్పోతుండటంతో రమేష్ రాథోడ్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన ఖానాపూర్ టిక్కెట్ ను ఆశిస్తున్నారు.

తుమ్మల బుజ్జగించినా.....

అయితే నిన్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో రమేష్ రాథోడ్ పేరు లేకపోగా, సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేరు ఉంది. దీంతో రమేష్ రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రమేష్ రాథోడ్ తో సుదీర్ఘంగా జరిపిన చర్చలు కూడా విఫలమయినట్లు తెలుస్తోంది. తుమ్మల ఎంత బుజ్జగించినా రమేష్ రాథోడ్ తన పట్టు వీడటం లేదు. తాను నమ్మకంతో పార్టీలోకి వస్తే తనను మోసం చేస్తారా? అని రమేష్ రాథోడ్ తీవ్ర ఆగ్రహంతో తుమ్మల ఎదుట నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. రమేష్ రాథోడ్ రేపు తెలంగాణ రాష్ట్ర సమితిని వీడే అవకాశముంది. మరి రమేష్ రాథోడ్ ఏ పార్టీలో చేరతారన్నది చూడాల్సి ఉంది.

Similar News