టీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి ఆయనను బహిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని హమీపై ఈ నెల 5న తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశానని, అప్పటి నుంచి కొందరు తెలంగాణ ద్రోహులు తనను కేసీఆర్ కు కలవనీయడం లేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం లేదని, తనలా బాధపడుతున్న వారు ఆ పార్టీలో ఇంకా చాలా మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని, త్వరలో గిరిజన మేదావులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు. గిరిజనులకు కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్ పెంపు హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.