ఏపీలో మరో రేవంత్.... హాట్ టాపిక్?

Update: 2018-12-28 09:30 GMT

ఎన్నికల సమయంలో నోరు అదుపులో ఉంచుకోవాలి. భాష సంస్కారవతంగా ఉండాలి. రాజీకీయనాయకులంటే ప్రజలకు సేవ చేసేందుకేనన్న విషయాన్ని మరిచి ఎన్నికలు అనగానే మల్లయుద్ధం గోదా గుర్తుకువస్తున్నట్లుంది. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా రాజకీయ నేతలను ప్రజలను పక్కనపెట్టారు. తెలంగాణ ఎన్నికలకు వెళ్లక ముందునుంచే రేవంత్ రెడ్డి వంటి నేతలు కేసీఆర్, ఆయనకుటుంబం, కులంపైన దూషణ, భూషణల పర్వానికి తెరలేపారు. కేసీఆర్ కుటుంబంపైన చేసిన విమర్శలకన్నా ఆయన కులంపైన చేసిన విమర్శలే రేవంత్ రెడ్డికి చెడ్డపేరు తెచ్చాయని చెప్పక తప్పదు. ఇలా రేవంత్ రెడ్డి పొగరుబోతు తనం, అహంభావం, అనాలోచితంగా మాట్లాడటం వల్లనే ఓటమిపాలవ్వడానికి ఒక కారణంగా చెప్పక తప్పదు.

జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలతో....

ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీలోనూ అనేక మంది రేవంత్ రెడ్డిలు తయారవుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను టార్గెట్ గా చేసుకుని ఆయన కుటుంబ విషయాలను, కుల ప్రస్తావనలు తీసుకురావడంతో నెట్టింట్లో ఈ రకమైన కామెంట్లు విన్పిస్తున్ానయి. ఇటీవల అనంతపురం లో జరిగిన ధర్మపోరాట సభలో పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి చేసిన ప్రసంగం ఏవగింపు కల్గించిందనే చెప్పాలి. ముఖ్యంగా కులం ఓట్లతో జగన్ రాజకీయం చేస్తున్నారని చెప్పడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏడాది కాలానికి పైగా పాదయాత్ర చేస్తూ అన్ని కులాలు, వర్గాలను కలుస్తుంటే కులాలను అంటకడతారా ? ని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.

మరో రేవంత్ రెడ్డి అంటూ...

ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరో రేవంత్ రెడ్డిగా మారనున్నారన్న సెటైర్లు కూడా విన్పిస్తున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు. ఆయన కుమారుడు పవన్ రెడ్డిని అనంతపురం లోక్ సభకు పోటీ చేయించాలని భావిస్తున్నారు. తాడిపత్రి నియోకవర్గంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గాని ఆయన కుమారుడు గాని బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పట్టిన గతే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి పడుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి.

నిత్యం వివాదాల్లోనే....

నిజానికి జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. హిందూపురం టిక్కెట్ కావాలంటే వైసీపీ నేత నవీన్ నిశ్చల్ ను పదికోట్లు కావాలని జగన్ డిమాండ్ చేసినట్లు జేసీ చెప్పడం వైరల్ అయింది. అలాగే కులాల ప్రస్తావన తీసుకురావడంతో వైసీపీ నేతలు మూకుమ్మడిగా జేసీపై మాటలదాడికి దిగుతున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో? తెలీదు కాని జేసీ దివాకర్ రెడ్డిని రేవంత్ తో వైసీపీ నేతలు పోలుస్తుండటం విశేషం.

Similar News