రేవంత్ రెడ్డి చేసింది ఇలా....!

Update: 2018-09-28 03:30 GMT

కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి అక్రమాల పుట్ట తవ్వినకొద్దీ బయటపడుతోంది. రేవంత్ అక్రమాస్తులపై న్యాయవాది రామారావు.. ఈడీకి ఫిర్యాదు చేయడంతో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకకాలంలో జూబ్లీహిల్స్, కొడంగల్‌తో పాటు 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశ, విదేశాల్లో అక్రమ లావాదేవీలు రేవంత్‌రెడ్డి జరిపినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. అమెరికా, మలేషియా, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ దేశాల్లో హవాలా మార్గంలో వందల కోట్లను రేవంత్‌రెడ్డి తరలించినట్లు రామారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న ఉదయం ప్రారంభమైన ఆదాయపు పన్ను శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి.

చట్టాలను ఉల్లంఘించి......

ఫెమా, మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా విదేశీ బ్యాంకు ఖాతాల్లో రేవంత్ డబ్బులు జమ చేశారు.2014, ఫిబ్రవరి 25న సింగపూర్‌లోని ఒక స్థిరాస్తిని 20 లక్షల సింగపూర్ డాలర్లకు రేవంత్‌రెడ్డి విక్రయించినట్లు ఫిర్యాదులో రామారావు పేర్కొన్నారు. అదే రోజున రేవంత్‌రెడ్డి హాంకాంగ్ బ్యాంకు ఖాతా నెం. 1260779653146కు 60 లక్షల మలేషియన్ రింగెట్స్‌ని బదిలీ చేసిన రఘువరన్ మురళి(ఆర్‌హెచ్‌బీ బ్యాంకు ఖాతా నెం. 100482930330069). 2014 ఫిబ్రవరి 25న రేవంత్‌రెడ్డికి సంబంధించిన కౌలాలంపూర్ ఆర్‌హెచ్‌బీ బ్యాంకు ఖాతా నెం. 1300098050844099కు రఘువరన్ మురళి ఖాతా నుంచి 20 లక్షల సింగపూర్ డాలర్లు(రూ. 9 కోట్ల 53 లక్షలు) బదిలీ చేశారు. 2014, ఫిబ్రవరి 25న ఒక్కరోజే రేవంత్‌రెడ్డి బ్యాంకు అకౌంట్లలో రూ. 20 కోట్ల విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు జరిగినట్లు ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు.

బినామీలతో......

దుబాయ్‌లో హవాలా ద్వారా రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఎన్నో అక్రమ వ్యాపార కార్యకలాపాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. అమెరికాలో ఉన్న మరో తమ్ముడు జగన్ రెడ్డి ద్వారా కూడా ఎన్నో అక్రమ కార్యకలాపాలు నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా రేవంత్‌రెడ్డికి బినామీగా వియ్యంకుడు వెంకట్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడు. నెక్సస్ ఫీడ్స్ లిమిటెడ్ పేరుతో షెల్ కంపెనీ నిర్వహిస్తూ రూ. 65 కోట్ల ప్రజాధనాన్ని రేవంత్‌రెడ్డి కొల్లగొట్టాడు. రూ. 14 కోట్లతో చైనా తైవాన్ నుంచి గోల్డెన్ ఫీడ్స్ పేరుతో మిషనరీని కొనుగోలు చేసిన వెంకట్‌రెడ్డి.. అదే మిషనరీని మరో బినామీ సయ్యద్ ఉబేద్‌కు చెందిన పయనీర్ ఎక్వీప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌కి రూ. 25 కోట్లకు అమ్మాడు. మళ్లీ అదే మిషనరీని రూ. 80 కోట్ల(ఇందులో రూ. 75 కోట్ల బ్యాంక్ లోన్)కు నెక్సస్ ఫీడ్ కొనుగోలు చేసింది. చేతులు మార్చడం ద్వారా ఒకే మిషనరీ ధరను రూ. 25 కోట్ల నుంచి రూ. 80 కోట్లకు రేవంత్‌రెడ్డి అండ్ కంపెనీ పెంచినట్లు ఫిర్యాదులో రామారావు వెల్లడించారు.

Similar News