తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనుముల రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ దాడులు రాజకీయంగా సంచలనంగా మారింది. ఆయన ఇవాళ కొడంగల్ లో ప్రచారం ప్రారంభేందుకు సిద్ధం అవుతున్న సమయంలో గురువారం ఉదయమే ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అయితే, ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డికి ఐటీ అధికారులు ఫోన్ చేసి హైదరాబాద్ రావాలని చెప్పారు. దీంతో కోస్గీ నుంచి ఆయన ప్రచారం ఆపేసి హైదరాబాద్ కి భారీ కాన్వాయ్ తో బయలుదేరారు. కాగా, గత కొన్ని రోజులుగా తన అరెస్టుకు కుట్ర జరుగుతోందని రేవంత్ అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కోస్గిలో ఇవాళ ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తాను జైలుకు వెళ్లినా కొడంగల్ లో తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. బయట ఉండి ప్రచారం చేస్తే తనకు 30 వేల మెజారిటీ వస్తుందని, జైలు కు వెళితే 50 వేల మెజారిటీ ఖాయమన్నారు. అంతా బాగుంటే మళ్లీ వచ్చి ప్రచారం చేస్తానని, ఒకవేళ జైలుకు వెళ్తే అక్కడి నుంచి నామినేషన్ పత్రాలు సమర్పిస్తానని స్పష్టం చేశారు.