తెలుగుదేశం నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పగించింది. తెలంగాణ శాసనసభ రద్దు కావడం, నవంబరులోనే ఎన్నికలు ఉంటాయని తేలడంతో తెలుగుదేశం పార్టీతో పొత్తుల విషయం తేల్చడానికి ముగ్గురు సభ్యులతో కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజులు ఉన్నారు.
రేపు బాబుతో భేటీ......
రేపు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. టీడీపీ సభ్యుల అభిప్రాయం మేరకు పొత్తులు ఉంటాయని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేసిన రేవంత్ అయితేనే చంద్రబాబును సీట్ల పంపకంపై ఒప్పించగలరన్న నమ్మకంతో అధిష్టానం ఈ ప్రక్రియలో రేవంత్ ను చేర్చినట్లు తెలుస్తోంది. మరి రేవంత్ పార్టీ మారిన సందర్భంగా టీటీడీపీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు అదే రేవంత్ తో టీటీడీపీ నేతలు పొత్తుల చర్చలు జరపాల్సి రావడం విశేషం.