అయ్యప్ప అందరికీ ఆయుధమయ్యారా ....!!

Update: 2018-10-21 18:29 GMT

అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన భక్తులకు శాంతి ప్రేమ ప్రతిరూపాలు. పరుష పదజాలం కానీ హింసకు స్వామి మాలాధారణలో చేయడం నియమ నిబంధనలకు విరుద్ధం. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని మారిపోయాయి. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ప్రశాంతతకు నిలయమైన కేరళ అయ్యప్ప సన్నిధానం రణక్షేత్రం గా మారిపోయింది. శాంతి స్వరూపులుగా ఉండాల్సిన అయ్యప్పలు మహిళలు కనిపిస్తే చాలు ఉగ్ర రూపులు అవుతున్నారు. పోలీసులు, ఇతర ఆంక్షలు వారికి అడ్డుగా కనిపించడం లేదు. వచ్చిన వారిని తరిమికొట్టి తమ సెంటిమెంట్ ను రక్షించుకోవడమే ప్రధాన కర్తవ్యంగా ఉద్యమిస్తున్నారు. దీనికి తోడు సామాజిక ఉద్యమకారులు, మహిళా సంఘాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజు ఎక్కడో అక్కడ సామాజిక ఉద్యమ కారులు మహిళా సంఘాలు నేతలు అయ్యప్పలతో యుద్ధానికి దిగుతున్నారు. ఇది కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వానికి తలపోటుగా మారింది.

రజనీ అలా... కమల్ ఇలా ...

దక్షిణాదిలో అయ్యప్ప అందరికి బాగా ఇష్ట దైవమే. ఆయన దర్శనానికి వున్న సెంటిమెంట్లపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజని అయ్యప్ప భక్తులవైపు నిలబడ్డారు. మహిళలకు సమాన హక్కులకు తాను కట్టుబడి వున్నా అని, అయితే దేశంలో ఒక్కో దేవాలయానికి ఒక్కో రకమైన కట్టుబాట్లు వుంటాయని దానికి అంతా కట్టుబడి వుండాలని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తూనే తన అభిప్రాయం ఇదంటూ తలైవా కుండబద్దలు కొట్టారు. అయితే మక్కల్ నీది మయ్యాం పార్టీ అధినేత సినీ నటుడు కమల్ హాసన్ భిన్నంగా స్పందించి చర్చనీయాంశం గా మారారు.

అలజడి ఎప్పటికి చల్లారేనో....?

శబరిమల లో మహిళల ప్రవేశం వివాదం సుప్రీం కోర్టు కి, అయ్యప్ప భక్తులకు సంబంధించింది అని తాను నిమిత్తమాత్రుడినంటూ ఈ వ్యవహారంలో గోడమీద పిల్లే బెటరనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. మరో పక్క శబరిమల లో ఉద్రిక్త పరిస్థితులకు ఆరెస్సెస్ కారణమని కేరళ సర్కార్ ఆరోపిస్తుంది. అయితే కాంగ్రెస్ సైతం సర్కార్ కి వ్యతిరేకంగానే ఉద్యమిస్తుండటంతో అయ్యప్ప అలజడి ఎప్పటికి చల్లారుతుందో తెలియక కేరళ కమ్యూనిస్ట్ సర్కార్ కలవరపడుతుంది. ఇది ఇలా ఉంటే ట్రావెన్ కొర్ దేవస్థానం మహిళల ప్రవేశాన్ని నిలిపివేసేందుకు సుప్రీం లో రివ్యూ పిటిషన్ కి సిద్ధమైంది. సుప్రీం కోర్ట్ తీర్పు రేపిన చిచ్చు తిరిగి వారే ఆర్పగలరని దేవస్థానం భావించడం గమనార్హం.

Similar News