ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి సర్వేశ్వరరావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం పాడేరులో ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... గిరిజనుల్లో సమర్థ నాయకుడిగా సర్వేశ్వరరావు ఎదిగారని, ఆయన ఆశయాల సాధనకు ప్రభుత్వపరంగా, పార్టీపరంగా అన్నిరకాలుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. సర్వేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.1 కోటి ఆర్థిక సహాయం, రెండో కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం, విశాఖపట్నంలో ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. ఇక పార్టీ తరపున కూడా రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. సర్వేశ్వరరావు పెద్ద కుమారుడికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.