వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గట్టి షాక్ ఇచ్చారు. వారు వరంగల్ ఈస్ట్ టిక్కెట్ తో పాటు భూపాల్ పల్లి నుంచి తమ కూతురు సుష్మితా పటేల్ కు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. భూపాలపల్లిలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా కొండా దంపతులు ప్రారంభించారు. అయితే, కేసీఆర్ మాత్రం భూపాలపల్లి నుంచి మళ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నే పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
సిట్టింగ్ స్థానం కూడా ఇవ్వకుండా...
ఇక సిట్టింగ్ స్థానమైన వరంగల్ ఈస్ట్ కూడా కొండా సురేఖను అభ్యర్థిగా ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. ఈస్ట్ లో టిక్కెట్ కోసం ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ప్రస్తుత మేయర్ నన్నపునేని నరేందర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య వంటి వారు కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఈ టిక్కెట్ ను పెండింగ్ లో ఉంచారు. కొండా సురేఖతో జిల్లా నేతలకు విభేదాలు ఉండటం వల్లే టిక్కెట్ ఆమెకు ప్రకటించనట్లు తెలుస్తోంది. అయితే, జిల్లాలో కొండా దంపతులు హరీష్ రావు వర్గంగా ముద్రపడ్డారు. పైగా వీరికి ప్రస్తుతం టీఆర్ఎస్ కు దూరమయ్యే స్థితిలో ఉన్న డి.శ్రీనివాస్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి రెండు టిక్కెట్లు ఆశించిన కొండా దంపతులకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వకపోవడం గట్టి షాక్ గానే భావించవచ్చు.