సోము స్మూత్ గానే ఇచ్చినా…?

ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి వేమూరి రాధాకృష్ణకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగా సమాధానమిచ్చారు. తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన [more]

Update: 2020-08-22 13:29 GMT

ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి వేమూరి రాధాకృష్ణకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగా సమాధానమిచ్చారు. తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన సంపాదకీయంపై సోము వీర్రాజు స్పందించారు. తమ పార్టీ అంతర్గత విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాజకీయ సలహాలు మీకు సన్నిహితుడైన చంద్రబాబుకు ఇవ్వవచ్చని సోము వీర్రాజు సూచించారు. ఈ మేరకు సోము వీర్రాజు రాధాకృష్ణకు బహిరంగ లేఖ రాశారు.

బీజేపీ అధ్యక్షుడి పత్రికా ప్రకటన ఇదీ…..

ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారిని ఉద్దేశించి “మీ జీవీఎల్, మీ ఇష్టం” అనే శీర్షికతో మీ విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది.
ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా?

అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను.

సోము వీర్రాజు.

Tags:    

Similar News