ఏపీలో రాజకీయ ఫలితాలపై అప్పుడే సర్వేలు మొదలయ్యాయి. కొన్ని సర్వేలు నమ్మశక్యంగా అనింపించినా.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అసలు ఇదెలా సాధ్యం అని అనిపిస్తూనే ఎన్నో సందేహాలు, యక్ష ప్రశ్నలు కలుగుతుంటాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే! అసలు ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది కూడా సందేహమే! ఆ పార్టీ తరఫున అసలు ఎవరైనా పోటీకి దిగుతారో లేదో తెలియని పరిస్థితి. మరి అలాంటి పార్టీకి ఇప్పుడు ఏడు ఎంపీ సీట్లు వస్తాయంటే ఆశ్చర్యమే కాదు.. అంతకంటే నవ్వు రాక మానదు. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ఏడు ఎంపీ సీట్లు వస్తే.. కాంగ్రెస్‌కు మూడు ఎంపీ సీట్లు వస్తాయట. నమ్మడానికి కూడా అసలు ఊహించని విధంగా ఉన్న ఈ ఫలితాలు.. టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఇక టీడీపీ, వైసీపీ సర్వేల్లోనూ తామే గెలుస్తామని పార్టీలు గొప్పగా చెప్పేసుకుంటున్నాయి.
జగన్, బాబు సర్వేలు......
మొన్నటికి మొన్న.. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్ రెడ్డి ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీని 30 సీట్లకే పరిమితం చేస్తామని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమ పార్టీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలిందా అంటే దానికి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మరి అంత గట్టిగా, అంత నమ్మకంతో ఎలా చెప్పగలిగారనేది ఇక్కడ ప్రశ్న. సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో ఇవి వెల్లడయ్యానని స్పష్టంగా చెప్పనవసరం లేదు. ఇక సీఎం చంద్రబాబు గురించి, ఆయన సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి.. ఆయన సర్వేలు నిర్వహించడం, ఫలితాలను బట్టి ప్రణాళికలు రచించడం వంటివి చేస్తుంటారు. ఆయన నిర్వహించిన సర్వేలోనూ టీడీపీకి 100 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతూ ఉంటారు. ఇక అధికారం తమదే అని ఆయన ప్రతి సమావేశంలో చెబుతూ ఉంటారు.
గత ఎన్నికల్లో.....
టీడీపీ వాళ్లు అయితే తమ సర్వేలో తమకు ఏకంగా 130 సీట్లు వస్తాయని తేలిందని గొప్పలు పోతున్నారు. కానీ వాస్తవంగా చూస్తే గ్రౌండ్ లెవల్లో ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు బీజేపీ కూడా సొంతంగా సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సర్వేలు ప్రారంభించింది. ఇందులో టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా అధికారం చేపట్టే అవకాశాలే లేవని తేల్చిచెప్పింది. ఆ పార్టీకి 227 సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్‌కు 78 సీట్లు వస్తాయని తేలింది. అయితే అధికారం సాధించేందుకు అవసరమైన సీట్లు బీజేపీకి దక్కకపోయినా.. మిత్ర పక్షాల సాయంతో మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని వెల్లడైంది. ఇదే సర్వేలో.. ఏపీలో ఆ పార్టీకి 7 సీట్లు వస్తాయట. గత ఎన్నికల్లో టీడీపీతో జట్టు కట్టిన కమలనాథులు 2 సీట్లు సాధించారు. ఇప్పుడు ఏడు సీట్లు వస్తాయంటే ఆశ్చర్యం కలగకమానదు మరి. ఇక కాంగ్రెస్‌కి కూడా మూడు ఎంపీ సీట్లు వస్తాయట. ఈ రెండు పార్టీలకు అసలు ఏపీలో ఏస్థాయి బలం ఉందో కనీస రాజకీయ అవగాహన ఉన్న వారికి కూడా తెలిసిపోతుంది. మరి ఈ సర్వేలు చూస్తే.. నవ్వు రాకుండా ఉండదు మరి!