వన్డే సిరీస్ గెలుచుకుని టి ట్వంటీ సిరీస్ లో వేట ప్రారంభించిన టీం ఇండియా తొలి మ్యాచ్ లో శుభారంభం చేసింది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో విండీస్ పై ఐదు వికెట్ల తేడాతో చెమటోడ్చి గెలిచి మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1 - 0 తో ముందడుగు వేసింది. కోహ్లీకి విశ్రాంతి నేపథ్యంలో రోహిత్ శర్మ నేతృత్వంలో రంగంలోకి దిగిన టీం ఇండియా తొలుత బౌలింగ్ చేపట్టింది. కులదీప్ అద్భుత బౌలింగ్ తో కీలకమైన విండీస్ వికెట్లను నేలకూల్చడంతో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులకే ఆ జట్టును పరిమితం చేసింది. విండీస్ లో అలెన్ 27 పరుగులతో టీం గౌరవప్రద స్కోర్ చేసేందుకు కృషి చేశాడు.
దినేష్ నిలకడగా.....
లక్ష్యం సులువుగా ఛేదిస్తుంది అనుకున్న టీం ఇండియా కు విండీస్ బౌలర్లు షాక్ ఇచ్చారు. 45 పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లను నేలకూల్చి భారత్ కి గట్టి సవాల్ విసిరింది విండీస్. కెప్టెన్ రోహిత్ సహా ధావన్ రెండెంకల స్కోర్ కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు. అయితే దినేష్ కార్తిక్ చక్కగా ఆడుతూ టీం ఇండియా విజయానికి బాటలు వేశాడు. కొత్త కుర్రాళ్ళ అండతో లక్ష్యాన్ని ఇంకా 2.1 ఒక ఓవర్ ఉండగానే గెలుపు ముంగిట నిలిపాడు దినేష్. కునాల్ అండతో విండీస్ కి ఏ మాత్రం అవకాశం చిక్కకుండా చక్కని షాట్లతో లక్ష్యాన్ని ఛేదించాడు దినేష్. విండీస్ బ్యాటింగ్ లైనప్ వెన్ను విరిచి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర వహించిన కులదీప్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.