వరల్డ్ కప్ లో విరాట్ పైనే ఆశలా?
ఈ ప్రపంచ కప్ సొంతం కావాలంటే పరుగుల యంత్రం విరాట్ కొహ్లి విజృంభిస్తేనే సాధ్యమవుతుందన్నది ప్రతి ఒక్కరి విశ్వాసం.
టీ 20 ప్రపంచ కప్ సమీపిస్తుంది. ఇండియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. అందులోనూ ఈ ప్రపంచ కప్ సొంతం కావాలంటే పరుగుల యంత్రం విరాట్ కొహ్లి విజృంభిస్తేనే సాధ్యమవుతుందన్నది ప్రతి ఒక్కరి విశ్వాసం. విరాట్ అంటేనే విజయం... కొహ్లి అంటే... ఒక నమ్మకం. విరాట్ కొహ్లి అంటే.... భరోసా.. అందుకే రానున్న ప్రపంచ కప్ లో విరాట్ కొహ్లిపై పెద్ద బాధ్యతే ఉంది. కొహ్లి కుదురుకుంటే చాలు ఇక పరుగుల వరదేనన్నది అందరికీ తెలిసిందే. విరాట్ కొహ్లికి ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచంలోని క్రికెట్ ను అభిమానించే వారిలో ఎక్కువమంది ఇతగాడిని ఆరాధిస్తారు. సచిన్ క్రికెట్ దేవుడిగా అభివర్ణిస్తే.. విరాట్ కొహ్లిని మాత్రం విజయ తీరాలకు చేర్చే ఆటగాడిగా అనుకుంటారు.ః
బాధ్యత అంతా....
అటువంటి విరాట్ కొహ్లిపై ఈ ప్రపంచ కప్ లో ఎంతో బాధ్యత ఉంది. ప్రతి మ్యాచ్ లో బ్యాట్ ఝుళిపించాల్సిందేనని ఆశిస్తున్నారు. బీసీసీఐ నుంచి కొహ్లిని ఆరాధించే అభిమానుల వరకూ ఇదే కోరుకుంటారు. కొహ్లికి ఈ అభిమానం ఊరికే రాలేదు. నిరంతర శ్రమ, కృషి, ఆటతీరు, కొట్టే షాట్లు.. నెలకొల్పిన రికార్డులు విరాట్ కు లక్షల సంఖ్యలో అభిమానులను తెచ్చి పెట్టాయి. కొహ్లి 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ వన్డేలో కేవలం పన్నెండు పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్ సెంచరీ పూర్తి చేయడానికి కొహ్లికి పథ్నాలుగు మ్యాచ్ ల సమయం పట్టింది. అప్పటి నుంచి ఇక విరాట్ వెనుదిరిగి చూసుకోలేదు. మైదానంలో చెలరేగిపోయాడు.
రికార్డుల పరంగా...
రికార్డుల పరంగా కూడా విరాట్ ను అధిగమించేవారు సమీపంలో ఎవరూ లేరు. అలాంటి సత్తా కొహ్లిది. ఇప్పుడు ప్రపంచ కప్ లో విరాట్ కొహ్లి కీలకంగా మారనున్నారు. మూడేళ్ల నుంచి ఫామ్ కోల్పోయి మైదానంలో అవస్థలు పడుతున్నా అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. ఆసియా కప్ లో సెంచరీ బాదడం ద్వారా కొహ్లి తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు. కొహ్లి బ్యాట్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటే చూసే వారికి రెండు కళ్లూ చాలవు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడతాడు. ఆసియా కప్ లో భారత్ ఓటమిని క్రికెట్ ఫ్యాన్స్ జీర్టించుకో లేక పోతున్నారు. కనీసం ఫైనల్ కు చేరాల్సిందన్న భావనతో ఉన్నారు. కానీ ఆసియా కప్ చేజారిపోయింది.
చెలరేగి ఆడాలని...
ఇప్పుడు ప్రపంచ కప్ ఊరిస్తుంది. ఎందరో ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొహ్లి పైనే భారం ఎక్కువగా ఉంటుంది. హోప్స్ కూడా ఫ్యాన్స్ కొహ్లిపైనే పెట్టుకుంటారు. కొహ్లి చెలరేగి ఆడాలని కోరుకుంటున్నారు. అప్పుడే భారత్ కు విజయం దక్కుతుందని భావిస్తున్నారు. విరాట్ కూడా పూర్తిగా ఫామ్ లోకి వచ్చినట్లేనని చెబుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ లు నిలకడగా ఆడితే చాలు ప్రపంచ కప్ మన చేతికొచ్చినట్లే. మరి విరాట్ పై భారం పెద్దగానే ఉంది. అయితే మైదానంలో ఎలా ఉండబోతుందన్నది వేచి చూడాల్సిందే. విరాట్.. నువ్వు విజృంభించు.. నీ సొగసైన షాట్ల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఏ మ్యాచ్ లోనైనా సమిష్టి కృషి వల్లనే విజయం సాధ్యమవుతుంది. అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు నిరాశపర్చకుండా ఆడగలిగితే మరోసారి భారత్ కు పొట్టి ప్రపంచ కప్ అందినట్లే.