Andhra Pradesh : కొత్త సీఎస్ విజయానంద్ .. కారణాలు బలమైనవేనట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ను నియమించడానికి చంద్రబాబు దాదాపు నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

Update: 2024-12-29 08:35 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ ను నియమించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా .విజయానంద్ నియమితులు కానున్నట్లు ఇప్పటికే ఏపీ ఐఏఎస్ అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు పొడిగించిన పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో విజయానంద్ ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలు స్తోంది. రేపు, ఎల్లుండి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల పేర్లు వినిపించినప్పటికీ చివరికి విజయానంద్ పేరును ఖరారు చేశారు.

ముందుగా అవకాశమిచ్చి...
అయితే సీనియారిటీ ప్రాతిపదికన మొదట జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్ పేరు వినిపించినప్పటికీ.. ఆయన్ను నియమిస్తే ఆయన పదవీకాలం ముగిసేలోగా విజయానంద్ పదవీ విరమణ చేస్తారు. అందువల్ల విజయానంద్ కు ముందుగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా చంద్రబాబు సీఎస్ విషయంలో సీనియారిటీకే ప్రాధాన్యత ఇస్తారన్నది గతంలోనూ అనేక సార్లు స్పష్టం కావడంతో విజయానంద్ పేరుకే చంద్రబాబు టిక్ పెట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది నవంబరులో ఆయన రిటైరయ్యాక సాయిప్రసాద్ ను చీఫ్ సెక్రటరీ గా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయానికి వచ్చారు.
అన్ని రకాలుగా...
దీంతో తన హయాంలో ఇద్దరికీ అవకాశం ఇచ్చినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. విజయానంద్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. బీసీ కులానికిచెందిన వారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ కు చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. చీఫ్ సెక్రటరీ ఎంపిక తనకు పాలనాపరంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన సాయిప్రసాద్ కు అవకాశమిస్తే బాగుంటుందని కూడా ఆయన భావిస్తున్నారని ఐఏఎస్ అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. సీనియారిటీ ప్రాతిపదిక తీసుకుంటే 1990 బ్యాచ్ కు చెందిన అనంతరాముకు ఇవ్వాల్సిఉంది. అయితే ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఆయన పేరు వెనక్కు వెళ్లిందన్న ప్రచారం జరుగుతుంది. అలాగే 1991 సుమితా దావ్రా కూడా కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో దావ్రా పేరు కూడా పరిశీలనకు లేకుండా పోయింది. మొత్తం మీద తదుపరి చీఫ్ విజయానంద్ అన్నది ఖాయమైనట్లే.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 


Tags:    

Similar News