Telangana : భట్టి గట్టిగా చెబితే వారందరికీ సంక్రాంతికి తీపి కబురేనట
రైతు భరోసా నిధులను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
రైతు భరోసా నిధులను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో అధికారులు కూడా సమాయత్తమయ్యారు. ఇందుకు అవసరమైన నిధులను రెడీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పథకానికి ఎంత మేర నిధులు అవసరమవుతాయి? అవసరమైన నిధులను అప్పులు చేయాల్సి వస్తుందా? అన్న దానిపై అధికారులు కసరత్తులు ప్రారంభించారు. దీనికి తోడుగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలను నేడు ఖరారు చేయనున్నారని తెలిసింది.
నేడు మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో...
రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అంటే ఏడాదిలో ప్రతి ఎకరాకు రైతుకు పదిహేను వేల రూపాయలు నష్టపోయారంటూ విపక్షాలు విమర్శిస్తున్ననేపథ్యంలో నేడు జరిగే ఉప సంఘం సమావేశంలో ఒక విడత నిధులు జమ చేయాలా? లేక రెండు విడతలకు సంబంధించిన నిధులను ఒకే సారి జమ చేయాలా? అన్న నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు ఎవరికి రైతు భరోసా ఇవ్వాలన్న దానిపై కూడా నేడు జరిగే సమావేశంలో క్లారిటీ రానుందని తెలిసింది. పది ఎకరాల వరకూ ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
వీరికి మాత్రం...
అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ పథకం నుంచి తొలగించాలని భావిస్తున్నారు. దీంతో చాలా వరకూ లబ్దిదారుల సంఖ్య తగ్గిపోయే అవకాశముంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై భారం కూడా తగ్గనుందని ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వం భూమి ఉన్న అందరికీ రైతు భరోసా ఇచ్చింది. అయితే సాగు అయ్యే భూములకే ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం కూడా మరింతగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెసులు బాటు కల్పించనుంది. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలన్నీ నేడు సమావేశమయ్యే మల్లు భట్టి విక్రమార్క ఉపసంఘం ఖరారు చేయనుండటంతో ఏ నిర్ణయాలు తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now