గత ఎన్నికల్లో హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో సనత్ నగర్ ఒకటి. తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 56 వేల ఓట్లు సాధించి 27 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన దండె విఠల్ 29 వేల ఓట్లతో రెండో స్థానంలో, కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మర్రి శశిధర్ రెడ్డి 23 వేల ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే, ఎన్నికల తర్వాత కొన్ని నెలలకే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. దీంతో ఈ ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారింది. ఇక్కడ గెలుపు శ్రీనివాస్ యాదవ్ తో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా మారింది.
చివరి నిమిషంలో వచ్చినా...
వాస్తవానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంతకుముందు సికింద్రాబాద్ నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిథ్యం వహించినా... గత ఎన్నికల సమయంలో ఆయన చివరి నిమిషంలో సనత్ నగర్ కు మారారు. అప్పటికే అక్కడి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్న వెంకటేష్ గౌడ్ సికింద్రబాద్ కి మారి ఓటమి పాలయ్యారు. అయితే, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినందున సెటిలర్ల ఓట్లతో శ్రీనివాస్ యాదవ్ గెలుపు సులువయ్యింది. బీజేపీతో పొత్తు కూడా ఆయనకు కలిసి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ తరుపున పోటీ చేయనుండటంతో నియోజకవర్గ రాజకీయాలు రంజుగా మారాయి.
కాంగ్రెస్ కి బలం ఉన్నా...
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బలంగా ఉంది. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైనా ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఇక్కడి నుంచి దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా ప్రాతినిథ్యం వహించారు. తర్వాత మర్రి శశిధర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, సెటిలర్ల ఓట్ల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు ఖాయమైనందున ఇక్కడి నుంచి కాంగ్రెస్ లేదా టీడీపీ అభ్యర్థి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ తరుపున సీనియర్ నేతగా శశిధర్ రెడ్డి ఉండటంతో ఆయనే పోటీ చేయనున్నారు. దీంతో ఇప్పటికైతే ద్విముఖ పోటీ ఖాయంగా కనపడుతోంది. బీజేపీ తరుపున కూడా పలువురు ఆశావహులు టిక్కెట్ ఆశిస్తున్నారు.
సెటిలర్ల ఓట్లే కీలకం
మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో మంచి మార్కులే వేయించుకున్నారు. ఇక్కడి బస్తీల్లో ఆయనకు సానుకూలత కనిపిస్తోంది. అయితే, సెటిలర్ల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపించబోతున్నాయి. టీడీపీతో కాంగ్రెస్ కి పొత్తు ఉన్నందున సెటిలర్లు మహాకూటమి వైపు ఉంటే మాత్రం గట్టి పోటీ జరగనుంది. కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీరి ఓట్లు ఏకపక్షంగా టీఆర్ఎస్ కే పడ్డాయనే అంచనాలు ఉన్నాయి. అదే ఇప్పుడూ జరిగితే మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సులువుగా మారనుంది.