బెట్టేది..? గుట్టేది.. నష్టమేగా?
తరచూ టీడీపీ అధినేతతో చంద్రబాబు భేటీ అవుతుండటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
తరచూ టీడీపీ అధినేతతో చంద్రబాబు భేటీ అవుతుండటం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో ఈ చర్చ జరుగుతుంది. పవన్ చంద్రబాబుతో పొత్తును ఎవరూ వ్యతిరేకించడం లేదు. బెట్టుగా ఉండి ముఖ్యమంత్రి స్థానంతో పాటు పెద్ద సంఖ్యలో సీట్లను అలయన్స్ లో దక్కించుకోవడానికి ఇది స్ట్రాటజీ కాదంటున్నారు. తరచూ చంద్రబాబుతో భేటీతో జనసేన క్యాడర్ లోనూ, కాపు సామాజికవర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలంటే బెట్టుగా, గుట్టుగా సెట్ చేసుకోవాల్సిన జనసేనాని ఇలా రచ్చ చేసుకోవడమేంటన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.
రెెండుగంటలకు పైగానే...
నిజానికి ఇద్దరి మధ్య రెండు గంటల పైగా చర్చించే అంశాలు ఏముంటాయన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఒక అరగంట చర్చించి ఉండవచ్చని, మిగిలిన సమయమంతా పొత్తులపైనే ఎక్కువ చర్చ జరిగి ఉండవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. పొత్తులపైన చర్చించలేదని కేవలం జీవో నెంబరు వన్ పైనే చర్చించామని చెబుతున్నా అది నమ్మశక్యంగా లేదనే వారే ఎక్కువగా ఉన్నారు. పవన్ తన యాత్రలో ఎక్కువగా తిరగాల్సిన ప్రాంతాలు, నియోజకవర్గాలతో పాటు జనసేనను బలోపేతం చేసుకోవాల్సిన నియోజకవర్గాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
బీజేపీని కలుపుకుని...
ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో కొంత బలోపేతం అయితే వైసీపీని దెబ్బకొట్టే అవకాశాలున్నాయని అభిప్రాపడినట్లు తెలిసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అండ ఉండాలంటే బీజేపీతో సయోధ్యతతో వెళ్లడమే మేలన్న సూచనను ఈ సందర్భంగా చంద్రబాబు చేసినట్లు తెలిసింది. సాధ్యమయినంత వరకూ.. చివరి వరకూ.. బీజేపీని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయాలని, లేకుంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామని చంద్రబాబుకు పవన్ కు చెప్పినట్లు రెండు పార్టీల్లో నేతలు అనుకుంటున్నారు. ఇందుకు పవన్ కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. అయితే టీడీపీ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఎలా ఒప్పించాలన్న దానిపై కూడా ఇద్దరి మధ్య ఎక్కువ సేపు చర్చ జరిగినట్లు సమాచారం.
ప్రచారంలోనూ...
పొత్తులతో పాటు ప్రచారంపై కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ప్రచారంలో ఇటు టాలివుడ్ లోని నందమూరి, మెగా ఫ్యామిలీ సభ్యులను కూడా ఉపయోగించుకోవాలని భావించినట్లు తెలిసింది. యువతను, మహిళలను ఆకట్టుకోగలిగితే సులువుగా విజయం లభిస్తుందన్న భావన ఇద్దరూ వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే 2014ల తరహాలో వచ్చే ఎన్నికలు అంత సులువు కాదని, రెండు పార్టీల సోషల్ మీడియాను కూడా మరింత బలోపేతం చేయాలని ఇద్దరూ అనుకున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై కూడా కొన్ని సూచనలను చంద్రబాబు చేసినట్లు తెలిసింది. అయితే చంద్రబాబుతో పవన్ భేటీ కారణంగా రాజకీయంగా అన్ని విధాలుగా నష్టపోయేది పవన్ మాత్రమేనని, చంద్రబాబుకు ఎలాంటి నష్టం ఏ విధంగా ఉండదన్న కామెంట్స్ అయితే జోరుగా వినిపిస్తున్నాయి.