వైవీబీ రాజేంద్ర ప్రసాద్... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ. ఇప్పుడాయన స్వంత పార్టీకే తలనొప్పిగా మారారు. ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనతో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీకే నష్టం చేసేలా ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నష్టం కలుగుతుందని మందలించినట్లు వార్తలు వచ్చాయి. ఇక టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఏకంగా ఆయనను జోకర్ గా పాల్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజేంద్ర ప్రసాద్ కు కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలే ఆయన చేశారు.
జగన్ పై దాడి ఘటనలో...
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజలు ఈ ఘటన, తర్వాతి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై చంద్రబాబు సహా పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలు జగన్ కు సానుభూతి పెంచాయి. ఇక రాజేంద్ర ప్రసాద్ లేటుగా రంగంలోకి దిగినా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ప్రజలెవరూ అంగీకరించని విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. వై.ఎస్. జగన్ పై హత్యాయత్నం ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలే చేయించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రజల అసహ్యించుకున్నారు. దీంతో ఇవి టీడీపీకే నష్టం చేశాయి. దీంతో ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావే రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనను ఏకంగా కమెడియన్ తో పోల్చారు.
ఇంతకుముందు కూడా ఇలానే...
రాజేంద్ర ప్రసాద్ కు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఆయన టాలీవుడ్ పై, నటులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టు విషయంలో తమిళ నటులలా ప్రత్యేక హోదా కోసం టాలీవుడ్ హీరోలు ఎందుకు పోరాడరని ప్రశ్నించిన ఆయన మా డబ్బులతో టిక్కెట్లు కొంటే కోట్లు సంపాదించుకుంటూ ఏసీ రూముల్లో కులుకుతున్నారని వ్యాఖ్యానించారు. అసలే టాలీవుడ్ లో టీడీపీకి మద్దతు ఎక్కువగా ఉంటుంది. వీరు కూడా ఈ వ్యాఖ్యలు జీర్ణించుకోలేకపోయారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మేలు అని టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఈ వ్యాఖ్యలు కూడా టీడీపీకి నష్టమే చేశాయి.
సీఎం సీరియస్....
అంతకముందు కూడా ఆయన ఓ ఫ్యాన్సీ నెంబర్ కోసం తన అనుచరుల వివాదంలో తలదూర్చడం, ఓ వ్యక్తిని బండబూతులు తిట్టడం కూడా వివాదాస్పదమైంది. మొత్తానికి ప్రత్యర్థులను విమర్శించడంతో తోటి నేతల కంటే ఒక్క అడుగు ముందుండాలని రాజేంద్రప్రసాద్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పాటు సొంత పార్టీనే ఇరుకున పెడుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జగన్ పై దాడి ఘటనపై రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై సీరియస్ అయినట్లు చెబుతున్నారు. సీనియర్లే ఇలా అదుపు తప్పి మట్లాడితే ఎలా? అని ప్రశ్నించినట్లు సమాచారం. ఇలా రాజేంద్రప్రసాద్ ప్రతి వ్యాఖ్యా పార్టీకి నష్టం చేకూరుస్తుందంటున్నారు పార్టీ నేతలు. మరి రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటారో? లేదో? చూడాలి.