కేసీఆర్ హెలికాప్టర్ షాట్... బాల్ ఎక్కడ పడుతుందంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీని ఈ నెల 19వ తేదీన ప్రకటించే అవకాశాలున్నాయి. కేసీఆర్ పక్కా ప్లాన్ తో ఉన్నారు

Update: 2022-06-16 06:23 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీని ఈ నెల 19వ తేదీన ప్రకటించే అవకాశాలున్నాయి. కేసీఆర్ పక్కా ప్లాన్ తో కేసీఆర్ ముందుకు వెళుతున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు మేరకు, తనకున్న రాజకీయ అనుభవాన్ని జోడించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఉత్తరాదిలోనూ విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది పార్టీ అంటే సహజంగా ఉత్తరాది వారికి చులకన, ఆ సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. ప్రధాని, రాష్ట్రపతి ఉన్నత పదవులకు దక్షిణాదివారిని ఎంపిక చేయాలంటేనే ఉత్తరాది వారికి మనసొప్పదు. అంగీకరించరు కూడా.

ఉత్తరాదిన...
అందుకే ఉత్తరాదిన ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీని విస్తరించే దిశగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా మోదీ హయాంలో రైతులు ఆందోళనలో ఉన్నారు. దాదాపు ఏడాది పాటు ఢిల్లీలో ఆందోళన చేసిన చరిత్ర రైతులది. దేశంలో 70 శాతానికి పైగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఆ రంగాన్ని తమకు అనుకూలంగా మలచుకోగలిగితే యాభై శాతం పార్టీ సక్సెస్ అయినట్లే అని కేసీఆర్ భావిస్తున్నారు.
టికాయత్ కు...
అందుకే ఉత్తరాది బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ కు ఇస్తారని సమాచారం. ఆయన పై రైతుల్లో గురి ఉందని కేసీఆర్ నమ్ముతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ లో రాకేష్ టికాయత్ కు బాధ్యతలను అప్పగించి, ఉత్తరాది విస్తరణను కూడా ఆయన భుజస్కంధాలపై పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రాకేష్ టికాయత్ తో త్వరలో కేసీఆర్ భేటీ అవుతారని సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా రైతులందరినీ ఏకం చేయగల శక్తి, సామర్థ్యం టికాయత్ కు ఉన్నాయని కేసీఆర్ నమ్ముతున్నారు. అందుకే ఆయనకు బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు.
రైతుల కోసం...
ప్రధానంగా దేశంలో రైతు బంధు, రైతు బీమా, ఎరువుల ఉచిత పంపిణీ వంటి పధకాల అమలుపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. దీనికి ఎంత ఖర్చవుతుంది? ప్రభుత్వంపై ఎంతభారం పడుతుంది? అన్న అంచనాలను నిపుణలతో చర్చిస్తున్నారు. ఈ పథకాలన్నీ దేశ వ్యాప్తంగా అమలు చేయగలిగితే రైతులు బీఆర్ఎస్ వెంట ఉంటారని విశ్వసిస్తున్నారు. అందుకే రాకేష్ టికాయత్ పేరును కూడా త్వరలో కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
టీఆర్ఎస్ ను కూడా....
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో సెంటిమెంట్ ను రగిలించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలోకి దక్షిణాది పార్టీ రావాలంటే ఇక్కడ ప్రజలు సహకరించాలన్న నినాదాన్ని బలంగా తీసుకెళ్లనున్నారు. ఎన్నికల సమయంలోనే దీనిని అమలు పర్చేలా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్‌ లో కూడా సమూలంగా మార్పులు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలిసింది. పార్టీపై కుటుంబ ముద్రను తొలగించడానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వేముల ప్రశాంత్ రెడ్డి పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నా, ప్రెసిడెంట్ గా మాత్రం వేముల ప్రశాంత్ రెడ్డి పేరును ఖరారు చేస్తారంటున్నారు. మొత్తం మీద ీకేసీఆర్ వర్క్ అవుట్ మామూలుగా ఉండదంటున్నారు.



Tags:    

Similar News