అలజడి.. ఆందోళన.. అందుకేనా?

కేసీఆర్ లెక్కలు ఇటీవల కాలంలో తప్పుతున్నాయి. వరసగా ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు.

Update: 2021-12-04 13:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలను రూపొందించడంలో ఉద్దండుడు. ఆయన వ్యూహాలకు జాతీయ పార్టీలు సయితం చిత్తయ్యాయి. ఒక్క దీక్షతో.. రక్తపు బొట్టు చిందించకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమనేత. ఇక రాజకీయాల్లో ఆయన ఆరితేరారు. ఆయన అనుభవమే అందలం ఎక్కించింది. రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది. ప్రతిపక్షాలను దరిదాపుల్లోకి లేకుండా దాదాపు ఏడేళ్ల నుంచి చేసుకున్నారు. కానీ ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది కేసీఆర్ లోనూ కొంత అలజడి ప్రారంభమయింది.

లెక్కలు తప్పడంతో....
ఏ ఎన్నికలు జరిగినా ఆయనదే పై చేయి అవ్వాలి. అందుకు సర్వేలు నిర్వహిస్తారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. అందుకే గ్రామ స్థాయి నుంచి సీఎం కుర్చీ వరకూ గులాబీమయం అయింది. అయితే కేసీఆర్ లెక్కలు ఇటీవల కాలంలో తప్పుతున్నాయి. వరసగా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. పైకి గెలుపోటములు సహజమేనని చెబుతున్నా లోపల మాత్రం భయం మొదలయింది.
మరోసారి గెలుపు కోసం...
హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలన్నది కేసీఆర్ తాపత్రయం. లక్ష్యం కూడా. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యారు. దుబ్బాకలో ఓటమిని పలు కోణాల్లో విశ్లేషించుకుని కేసీఆర్ సంతృప్తి పడ్డారు. అభ్యర్థి ఎంపిక సరిగా లేకపోవడం, అక్కడ అతి విశ్వాసంతోనే ఓటమి పాలయ్యామని తనకు తానే సర్ది చెప్పుకున్నారు. కానీ హుజూరాబాద్ అలా కాదు. వందల కోట్లు కుమ్మరించారు. దళిత బంధును ప్రవేశపెట్టారు. అయినా ఓటమి ఎదురయింది.
అలెర్ట్ అయినట్లేనా?
అందుకే కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ప్రభుత్వంపై ప్రజలు ఆలోచనలు ఎలా ఉన్నాయన్న దానిపై సర్వే చేయించడానికి సిద్ధమయ్యారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిర్వహించిన సర్వే సంస్థలను పక్కన పెట్టారు. వాటిపై నమ్మకం పోయింది. అందుకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంతో కేసీఆర్ భేటీ అయ్యారు. వారితో సర్వే చేయించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అవసరమైతే పీకే టీంతో ఒప్పందం కూడా కుదుర్చుకుని వచ్చే ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలను సిద్ధం చేయాలని భావిస్తున్నారట.కానీ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం వైఎస్ షర్మిల పార్టీకి పనిచేస్తుంది. మరి తాను కూడా ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంటారా? జనం నాడి ఎలా ఉందో పీకే టీం ద్వారా తెలుసుకుని సరిదిద్దుకును ప్రయత్నం చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News