కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టినట్లేనా?
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సంకేతాలను పంపుతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారన్న సంకేతాలను పంపుతున్నారు. కొద్ది రోజులుగా కేసీఆర్ చేస్తున్న హడావిడి ఎన్నికల కోసమే. ఆయన జిల్లాల పర్యటన కావచ్చు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని రాష్ట్రాల పర్యటనలు కావచ్చు. తాజాగా ఉద్యోగాల భర్తీ కావచ్చు. ఇవన్నీ ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే చెప్పాలి.
రెండు సార్లు సెంటిమెంట్....
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి కేసీఆర్ సెంటిమెంట్ తో విజయం సాధించారు. సీట్లు తక్కువగా వచ్చినా రాజకీయ పునరేకీకరణ జరగాలని చెబుతూ మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నారు. రెండోసారి ఇంకా ఏడాది ఎన్నికలకు సమయం ఉండగానే ముందస్తుకు వెళ్లారు. ఆ ప్రయోగం కూడా విజయవంతమయింది. రెండో సారి కూడా సెంటిమెంట్ ను రగిలించి అధికారంలోకి రాగలిగారు.
యువతలో అసంతృప్తి....
ఇక మూడోసారి సెంటిమెంట్ కు తావులేదు. వాస్తవంగా చూస్తే కేసీఆర్ పాలనపై అసంతృప్తి బయలుదేరింది. ప్రాజెక్టులు నిర్మించినా అందులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వివిధ పథకాల ద్వారా కొన్ని వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశారు. రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు హిట్ అయ్యాయి. ఇక తాజాగా దళిత బంధు పథకంతో కూడా కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగుల్లో నిరాశ స్పష్టంగా కన్పిస్తుంది. రెండు ఉప ఎన్నికల్లో ఓటమి కూడా ఎదురయింది.
విపక్షాలు డైలమా....
తెలంగాణలో యువత టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉందని వివిధ సర్వేల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ దానిని కూడా తొలిగించే ప్రయత్నం చేశారు. దాదాపు 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేసి విపక్షాలను డైలమాలోకి నెట్టేశారు. విపక్షాల వద్ద విమర్శలకు ఎలాంటి అస్త్రాలు లేకుండా కేసీఆర్ చేయగలిగారని, వచ్చే ఎన్నికల్లో యువత కూడా గులబీ పార్టీకి అండగా నిలబడుతుందని, అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లను కేసీఆర్ చావు దెబ్బకొట్టారని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.