తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనపడుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలను విశ్లేషిస్తే ఆయన ఇవాళ క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే డిసెంబర్ లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలు ఖాయమని అన్ని పార్టీలే భావిస్తున్నాయి. టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి. అయితే, ముందస్తు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ మరోసారి విజయఢంకా మోగిస్తుందా ..? లేదా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? అసలు ఎవరి ప్లస్ లు ఏంటీ, ఎవరి మైనస్ లు ఏంటీ అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.
టీఆర్ఎస్ ప్లస్ లు
- ప్రతిపక్షాలు పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధం కాకపోవడం.
- ఇటీవలే ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలతో ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొంది ఉండటం.
- లోక్ సభతో కాకుండా ముందే ఎన్నికలు జరగడం ద్వారా కేంద్ర పరిస్థితుల ప్రభావం ఓటింగ్ పై ఉండకపోవడం.
- ఇప్పటికే సుమారు 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత ఉండటం.
టీఆర్ఎస్ మైనస్ లు
- ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సరైన కారణం చెప్పలేకపోవడం.
- అనేక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు.
- క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎన్నికలకు ఇంకా సిద్ధం కాకపోవడం.
- అనేక మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత.
కాంగ్రెస్ పార్టీ ప్లస్ లు
- టీడీపీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో పొత్తులు కలిసి వచ్చె అవకాశం.
- టీఆర్ఎస్ వైఫల్యాలు, నెరవేర్చని ఎన్నికల హామీలు.
- మిగతా పార్టీలు బలంగా లేకపోవడం వల్ల టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తుండటం.
కాంగ్రెస్ పార్టీ మైనస్ లు
- ఎన్నికలకు నాయకత్వంగా ఇంకా సన్నదంగా లేకపోవడం.
- పార్టీలో గ్రూపు తగాదాలు.
- టిక్కెట్లపై స్పష్టత లేకపోవడం.
- మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం.