తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టంకి తెరపడనుండటంతో అన్ని పార్టీలు పూర్తి స్థాయి ప్రచారం పై దృష్టి పెట్టనున్నాయి. జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న కారు పార్టీ ఇప్పుడు మరింత దూకుడు పెంచనుంది. గులాబీ బాస్ రోజుకు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనే ప్రణాలికను టీఆరెస్ సిద్ధం చేస్తుంది. నేటి నుంచి కెసిఆర్ తన సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన కోసం ఒక ప్రత్యేక హెలికాఫ్టర్ ఇప్పటికే సిద్ధం చేశాయి పార్టీ శ్రేణులు.
సైకిల్ కాంగ్రెస్ అంతే ...
ఇక ప్రధాన విపక్షం కాంగ్రెస్ తన కొత్త మిత్రులు టిడిపి తో కలిసి విస్తృత ప్రచారానికి రంగంలోకి దూకడానికి సిద్ధంగా వుంది. రాహుల్ గాంధీ తో కలిసి చంద్రబాబు సాగించే ప్రచారం ఎలా వుండబోతుందన్న ఆసక్తి ఇప్పటికే అన్ని వర్గాల్లో నెలకొనివుంది. వీరి ప్రచారానికి తోడు సోనియా గాంధీ ఈనెల 23 న తెలంగాణాలో ప్రచారానికి రానుండటంతో ఆ పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రచారం చివరి అంకంలో భారీ ర్యాలీలతో చంద్రబాబు, రాహుల్ ఆకట్టుకునే ప్రణాలికను సిద్ధం చేస్తున్నారు. రాహుల్, బాబు ల సుడిగాలి పర్యటనల కోసం ప్రత్యేక హెలీకాఫ్టర్లను ఇప్పటికే మాట్లాడి పెట్టినట్లు సమాచారం.
బిజెపి నేను సైతం ...
తెలంగాణాలో ఒంటరి పోరుకు సిద్ధమైన కమలం పార్టీ సైతం తమ స్టార్స్ ను సీన్ లోకి దింపేందుకు ప్రిపరేషన్ గట్టిగా మొదలు పెట్టింది. రెండు మూడు సార్లు పార్టీ అధినేత అమిత్ షా సభలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందుకోసం ఆయనకూడా హెలికాఫ్టర్ ద్వారానే వేగంగా తెలంగాణ అంతా పర్యటించనున్నారు. ఇక మోడీ చివరి అంకంలో ఎంటర్ అయి పార్టీకి జోష్ తెచ్చేలా ప్లాన్ చేస్తుంది కమలం. ఇలా ఎవరికీ వారు పక్కా ప్రచార వ్యూహాలతో వాయు విహంగాలతో హోరెత్తించేయనున్నారు. మరి ఎవరికీ పీఠం దక్కుతుందో చూడాలి.