అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వీరికే టికెట్ ఇస్తారా…?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గులాబీ నేత కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు వేస్తున్నారు..

Update: 2023-08-12 07:16 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గులాబీ నేత కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు వేస్తున్నారు. రాజకీయాల్లో ఎత్తుగడలు వేయడం అంటే అది కేసీఆర్ కే సాధ్యమంటూ ఓ బ్రాండ్ ను ఏర్పర్చుకున్నారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు గులాబీ దళపతి కేసీఆర్ రంగంలోకి దింపే అభ్యర్థుల జాబితాను రెడీ చేసినట్లు బీఆర్ఎస్ వర్గాల ద్వారా సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరికి దక్కుతుందో.. ఎవరి ఆశలు నిరాశ అవుతుందనే ఉత్కంఠలో ఉన్నారు నేతలు. ఇప్పటికే చాలా మంది నేతలు తమకే టికెట్ ఇవ్వాలంటూ గులాబీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరి పైరవీలు వారివే ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పెద్దలను ఎంత ప్రసన్నం చేసుకున్నా చివరి నిమిషంలో ఏం జరుగుతుందోనని సందిగ్దంలో ఉన్నారు నేతలు.

అసెంబ్లీ ఎన్నికల పోటీకి ఎమ్మెల్సీలు

కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎర్ కు చెందిన దాదాపు 13 మంది ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇందులో కనీసం ఆరేడుగురు అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి కేటీఆర్ సన్నిహితులై ఎమ్మెల్సీలు జనగామ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబీపూర్ రాజు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మంత్రి సత్యవతి రాథోడ్ లు కూడా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి టికెట్ తనదేనని ఇప్పటికే ప్రచారం చేసుకుని నియోజకవర్గంలో సైతం పర్యటిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూర్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తుండగా, కౌశిక్ రెడ్డి హుజురాబాద్ అసెంబ్లీ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నాంపల్లి, అంబర్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు విశ్శసనీయ సమాచారం.

నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి నాగార్జున సాగర్ అసెంబ్లీ బరిలో దిగేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె కృశాంక్ గజ్జెల నగేష్, దివంగత ఎమ్మెల్సే సాయన్న కుమార్తె లాస్య నందిని కూడా పోటీలోకి దిగేందుకు రంగం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంటు సభ్యులుగా ఉన్న పలువురు నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇక మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి బరిలో దిగేందుకు టికెట్ ఆశిస్తన్నారని తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలో పర్యటిస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ గులాబీ నేత కేసీఆర్ గత సంవత్సరం కిందటే ఆయనకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో ఆయనకు దుబ్బకు టికెట్ ఖరారైనట్లు నేతలు చెబుతున్నారు. వీరే కాకుండా మరి కొందరు నేతలు టికెట్ ఆశిస్తూ కేసీఆర్, కేటీఆర్, మరి కొంత మంది పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News