ఏది జరిగినా పెద్దాయన మంచికేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మానసికంగా సిద్ధమయినట్లే కనిపిస్తుంది.

Update: 2022-11-17 04:14 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మానసికంగా సిద్ధమయినట్లే కనిపిస్తుంది. తనతో జనసేన, బీజేపీ కలసి రాకపోయినా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకే తనకు చివరి ఎన్నికలు అని ఆయన ప్రస్తావించారు. జనసేన తనతో కలిసినా, రాకున్నా వచ్చే నష్టమేదీ లేదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లుంది. ఆయనకు అంతా మంచే జరుగుతుందా? జనసేన తనతో కలసి రాకపోయినా చంద్రబాబుకు రాజకీయంగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదా? అంటే ప్రస్తుతానికి మాత్రం అవుననే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు పై మధ్యతరగతి, ఉన్నతవర్గాల ప్రజలలో మాత్రం ఒక ప్రత్యేక అభిమానం ఉంది. విజన్ ఉన్న నేతగా ఆయనను అనుకుంటారు. చంద్రబాబు వల్ల రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని నమ్ముతారు. అదే సమయంలో అట్టడుగు వర్గాల్లోనూ ఎన్టీఆర్ వేసిన బీజం కొంత మేర అలాగే ఉంది. ఆ అభిమానం చెక్కు చెదరలేదనడానికి ఉదాహరణ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతమేనని చెప్పాలి.

అడ్వాంటేజీ కంటే...
ఇప్పుడు పవన్ కల్యాణ్ తన వెంట వస్తే కొంత అడ్వాంటేజీ ఉండి ఉండవచ్చు. కాపు సామాజికవర్గంలోనూ, యువతలోనూ కొంత అదనపు బలం చేకూరవచ్చు. కానీ గంపగుత్తగా కాపులు మొత్తం తమ వెంట నడుస్తారన్న నమ్మకం లేదు. పవన్ వస్తే తమ పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన బీసీలందరూ వ్యతిరేకమవుతారు. అది కూడా చంద్రబాబుకు పవన్ తో కలసి నడిస్తే నష్టమేనన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. తనపై ఒక ముద్ర తొలగించుకోవడానికి కూడా చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు ఉపయోగపడతాయి. ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబు గెలవలేరన్న అపప్రథ నుంచి తాను బయటపడేందుకు వీలుంటుంది.

ఆ రోజులు మారాయి...
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీకి అడ్వాంటేజీ అన్నది ఒకప్పుడు మాట. కానీ రోజులు మారాయి. ప్రజల్లో మార్పు వచ్చింది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందుకే ప్రజలు కూడా తాము ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారో ఆ పార్టీకి ఓటు వేస్తారు తప్ప. కులాలు చూడరు. అభిమానం చూపరు. అందరూ కోరుకుంటే వన్ సైడ్ విజయం దక్కుతుంది. దానిని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. పొత్తులతో తాము ముందుకు వెళితే జరిగే నష్టాల కంటే లేకుంటే వచ్చే ప్రయోజనాలే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు.
లాస్ట్ ఛాన్స్ అంటే...
చంద్రబాబుకు ఏపీ రాజకీయాల్లో ఒక అడ్వాంటేజీ వచ్చే ఎన్నికలలో ఉందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. వయసు రీత్యా ఆయనకు కొంత సానుభూతి లభిస్తుంది. పవన్ కల్యాణ్ ఒక్క ఛాన్స్ అన్నా వినరేమో కాని, చంద్రబాబు తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వమంటే ప్రజలు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. పైగా టీడీపీని అంత తీసేసే పార్టీ కాదు. ప్రతి గ్రామంలో జెండా ఉన్న పార్టీ అది. ప్రతి బూత్ లో బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ అది. అందుకే పవన్ తన దరి చేరకుండా వెళ్లినా చంద్రబాబుకు ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ లేదు. పైగా అందరూ కలసి పెద్దాయనను ఇబ్బంది పెడుతున్నారన్న సానుభూతి దొరుకుతుంది. అందుకే పవన్ తమను కాదనుకుని వెళ్లినా చంద్రబాబుకు ఎలాంటి నష్టం లేదు. అంతే కాదు 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు, క్యాడర్ మరింత జోరుగా పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. చూడాలి మరి.. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో జరిగే ప్రత్యేకంగా జరిగే నష్టం లేదు. అలాగని వచ్చే ప్రయోజనం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News