బోర్డు తిప్పేయాల్సిందేనా....?

Update: 2018-12-23 00:30 GMT

గెలిచి ఏం చేయాలి...? నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలా? లేక పార్టీని నమ్ముకుని ఉండాలా? మరో ఐదేళ్లపాటు వెయిట్ చేయడం ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో గెలిచిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులిద్దరూ వారికి వారు వేసుకుంటున్న ప్రశ్నలు. దీనికితోడు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఒకరికి కేబినెట్ పదవి, మరొకరికి నామినేటెడ్ పోస్టు. కండువాను మార్చేయాలా? లేక పార్టీలో కొనసాగాలా? అన్నది వారింకా తేల్చుకోలేకుండా ఉన్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు శాసనసభ్యులు పార్టీని వీడితే తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యమే ఉండదు.

రెండు స్థానాల్లో గెలిచి.....

తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందా? గెలిచిన రెండు స్థానాలు కూడా ఖాళీ అయిపోతున్నాయా? ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 13 స్థానాల్లో పోటీ చేయగా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అదీ ఖమ్మం జిల్లాలో మాత్రమే. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావులు మాత్రమే గెలుపొందారు. సండ్ర వెంకట వీరయ్య గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే గెలుపొందారు.

పార్టీ మారకూడదనుకున్నా.....

సండ్ర వెంకటవీరయ్య గత నాలుగున్నరేళ్లు పార్టీలోనే కొనసాగారు. పార్టీని దాదాపు 13 మంది వీడినప్పటికీ పార్టీలో ఉన్న ఒకే ఒక వ్యక్తిగా సండ్ర వెంకటవీరయ్య ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద గుర్తింపు పొందారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా కూడా చంద్రబాబు అవకాశం కల్పించారు. ఎందరు పార్టీని వీడినా సండ్ర మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతినడంతో మరో ఐదేళ్లు వెయిట్ చేయడం దండగని సండ్ర భావిస్తున్నారు. అందుకే ఆయన గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈమేరకు ఆయన అనుచరులతో సమావేశమై కీలక నిర్ణయాన్ని నేడో రేపో ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఉండి ఏం లాభం...?

అలాగే మరో శాసనసభ్యుడు మచ్చా నాగేశ్వరరావు కూడా పార్టీ మారే ప్రసక్తి లేదని చెబుతున్నా ఆయనకు కూడా భారీ ఆఫర్లే వస్తున్నాయి. నామినేటెడ్ పదవి ఇస్తామన్న హామీ టీఆర్ఎస్ నుంచి వచ్చిందంటున్నారు. సండ్రతో చర్చలు జరిపిన మచ్చా నాగేశ్వరరావు మౌనంగా ఉన్నప్పటికీ సండ్ర వెంటే ఆయనకూడా పయనిస్తారన్న వాదన బలంగా విన్పిస్తోంది. పదవుల కోసమే కాకపోయినా తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడటంతో ఆ పార్టీలో ఉండి కూడా ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో ఖాళీ అయిపోయినట్లేనని చెప్పాలి.

Similar News