తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ కు అంతర్జాతీయ గుర్తింపు
నవంబర్ 20, 2021న తెలుగు ఫ్యాక్ట్ చెక్ తో తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ జర్నీ మొదలైంది. అప్పటి నుండి నిరాధారమైన వార్తలు, అసత్య వార్తలు..
తెలుగుపోస్ట్ కు లభించిన IFCN సభ్యత్వం
ట్రూత్ సీరమ్ మీడియా సంస్థ స్థాపించిన telugupost.com వార్తల సమాచార వెబ్ సైట్ లో ఫ్యాక్ట్ చెకింగ్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2017 నుంచి telugupost.com లో వివిధ రంగాలకు చెందిన వార్తలు పబ్లిష్ అవుతున్నాయి. సంక్షిప్త వార్తల సమాహారంతో పాటు.. రీడర్స్ కు తప్పుడు సమాచారం పై అవగాహన కల్పించేందుకు తెలుగుపోస్ట్ సంస్థ 2021 నుంచి ఫ్యాక్ట్ చెక్ ను ప్రారంభించింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారంతో కూడిన మెసేజ్ లు మొదలు.. వైరల్ వీడియోలు, రాజకీయాల్లో తప్పుడు స్టేట్ మెంట్లు, మార్ఫింగ్ ఫొటోలు, హెల్త్, సైన్స్ పై వచ్చే అసత్య వార్తలపై తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ పనిచేస్తోంది.
నవంబర్ 20, 2021న తెలుగు ఫ్యాక్ట్ చెక్ తో తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ జర్నీ మొదలైంది. అప్పటి నుండి నిరాధారమైన వార్తలు, అసత్య వార్తలు, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టులు, హెల్త్, సైన్స్ పై వచ్చే అసత్య ప్రచారాలపై ఫ్యాక్ట్ చెక్ లు చేస్తూ.. ముందుకు సాగుతోంది. తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్.. మే 14, 2022 నుండి ఇంగ్లీష్ ఫ్యాక్ట్ చెక్, మే 18, 2023 - ఉర్దూ ఫ్యాక్ట్ చెక్ లు చేస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలుగులో 292, ఇంగ్లీష్ లో 290, ఉర్దూలో 16 ఫ్యాక్ట్ చెక్ లు చేసింది.
తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ.. మూడు భాషల్లో చేస్తున్న ఫ్యాక్ట్ చెక్ లకు నేడు INTERNATIONAL FACT CHECKING NETWORK (IFCN) Signatory నుంచి తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెకింగ్ కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వాషింగ్టన్ పోస్ట్, బూమ్ లైవ్, టీవీ టుడే, యూఎస్ఏ టుడే, రైటర్స్ వంటి 123 దిగ్గజ ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలతో కలిసి పనిచేసే IFCN నుంచి తెలుగుపోస్ట్ సంస్థ ఫ్యాక్ట్ చెకింగ్ కు అంతర్జాతీయ గుర్తింపు రావడంపై సంస్థ హర్షం వ్యక్తం చేసింది.
ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్(IFCN) తమ భాగస్వామ్యులైన ఫ్యాక్ట్ చెక్ సంస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఫ్యాక్ట్ చెక్ కథనాలను ప్రచురించేటప్పుడు సదరు సంస్థలు సిద్ధాంతాలకు, నియమావళికి కట్టుబడి ఉన్నారా లేదా అని పరిశీలిస్తుంది.
తెలుగుపోస్ట్ IFCN భాగస్వామ్యంగా ఉన్న 123 సంస్థలలో భాగమైంది. IFCN వివరించిన నియమావళిని పాటిస్తూ.. పూర్తి నిబద్ధతను కనబరుస్తామని తెలుగుపోస్ట్ చెబుతోంది. ఫ్యాక్ట్ చెకింగ్ చేయడంలో పారదర్శకత చూపుతూ, పక్షపాతం లేకుండా, ఉత్తమ పద్ధతులను అవలంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ వెల్లడించింది. ఏది వాస్తవం.. ఏది అవాస్తవమో రీడర్స్ కు తెలియజేసేందుకు ఇకపై IFCNతో కలిసి మరింత బాధ్యతగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తామని తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ లీడ్ సత్యప్రియ బీఎన్ తెలిపారు. తెలుగుపోస్ట్ సంస్థకు ఎడిటర్ గా రవిశ్రీనివాస్ ఉన్నారు.