బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా రాకముందే పార్టీలో రాజుకుంటున్న అగ్గి

తెలంగాణలో రాజకీయాలు ఉత్కంఠంగా మారుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత..

Update: 2023-08-21 05:40 GMT

తెలంగాణలో రాజకీయాలు ఉత్కంఠంగా మారుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గులాబీ టీమ్‌లో రేసు గుర్రాలు ఎవరన్నది ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే అభ్యర్థుల జాబితా కాస్త బయటకు వచ్చినా.. కొన్ని మార్పులు జగినట్లు తెలుస్తోంది. అందుకే కొందరి అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రేసు గుర్రాలు ఎవరన్నది ఉత్కంఠ నెలకొంది. అయితే అభ్యర్థుల పేర్లు ఇంకా ప్రకటించక ముందే ఆ పార్టీలో అగ్గి రాజుకుంటోంది. పలు నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు బదులు కొత్తవారికి టికెట్‌ ఇస్తున్నారంటూ పార్టీ ఇస్తున్న లీకులతో శ్రేణులు ఆందోళన మొదలైంది. మరికొన్ని చోట్ల పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా.. సిటింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తున్నారంటూ భగ్గుమంటున్నారు. ఇలా ఒకరికి టికెట్‌ ఇచ్చానా.. ఇవ్వకపోయినా నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు కొందరు. గుట్టుచప్పుడు కాకుండా సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా అనుచరుల నేతలు నిరసనలు తెలిపేందుకకు సిద్ధమవుతున్నారు. ఇక వైరా నియోజకవర్గంలో ఇది విపరీత చర్యలకు దారితీసింది.

ఈ సారి టికెట్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు కాకుండా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు ఖాయమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో మదన్‌లాల్‌ వర్గం నేతలు ఎమ్మెల్యే వర్గంపై మండిపడుతున్నారు. మదన్‌లాల్‌ ఫొటోలను మహిళ ఫొటోతో కలిపి మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టారని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలోని అన్ని పోలీసుస్టేషన్లలోనూ దీనిపై ఫిర్యాదులు చేశారు.

అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలో మళ్లీ సిటింగ్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకే టికెట్‌ ఖరారైందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచారం చేసుకొమ్మని ఆయనకు చెప్పినట్టుగా వనమా వర్గీయులు చెబుతున్నారు. వనమా కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు 'గడపగడపకు గడల' పేరుతో ప్రచారంలోకి దిగారు. ఇలా అభ్యర్థుల పేర్లు పూర్తిగా ఖరారు కాకముందే ఆందోళన మొదలైంది. కొందరు టికెట్‌ రాని వారు సోమవారం ఉదయం నుంచి కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఇంటి దాటి పట్టారు. తమకు టికెట్‌ కేటాయించేలా కేసీఆర్‌తో మాట్లాడాలంటూ ఎవరికి వారు అభ్యర్థించుకుంటున్నారు. అయితే ఈ సారి అభ్యర్థుల విషయంలో కేసీఆర్‌ క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ మేరకే అభ్యర్థులకు టికెట్‌ ఖరారు చేసినట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే టికెట్‌ రాని వారికి సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్లు చేసి బుజ్జగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేటీఆర్‌ కూడా వారికి రానున్న రోజుల్లో ఏదో విధంగా పార్టీలో మంచి అవకాశలు ఉంటాయని, ఎలాంటి ఆందోళన చెందవద్దని, కార్యకర్తలు ఆందోళనకు గురి కావద్దని చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారి టికెట్‌ కోల్పోయిన వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News